మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలంలో జిల్లా ఎస్పీ అట్టడా బాబుజీ పర్యటించారు. మన్యంలో లాక్డౌన్ అమలవుతున్న తీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
లాక్డౌన్కు గిరిజనులు సహకరిస్తున్నారు..
గిరిజన ప్రాంత ప్రజలందరూ లాక్డౌన్కు ఎంతో సహకరిస్తున్నారని ఎస్పీ తెలిపారు. స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.
మావోయిస్టుల రాకను నిరాకరిస్తున్నారు...
జీసీసీ ద్వారా ప్రతి గ్రామానికి రేషన్ అందిస్తున్నట్లు బాబుజీ వివరించారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాల గిరిజనులు మావోయిస్టుల రాకను నిరాకరిస్తున్నారన్నారు. ప్రస్తుతం అందరూ ఆరోగ్య సమస్యలపై పోరాడుతున్నారన్నారు.
వలస కూలీలను ఆదుకుంటున్నాం..
విశాఖలో 10 వేల మందికి పైగా వలస కూలీలు ఉన్నారనీ, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ సూచించారు.
ఇదీ చదవండి:పాడేరులో ఒడిశా మద్యం పట్టివేత: ముగ్గురు అరెస్ట్