solution to ring nets issue: రింగు వలల వివాదానికి పరిష్కారం లభించింది. నిబంధనల మేరకు వేట సాగించాలని మంత్రులు, అధికారులు చేసిన సూచనకు మత్స్యకారులు అంగీకరించారు. విశాఖ తీరంలో రింగు వలల వినియోగంపై ఇటీవల మత్స్యకారుల మధ్య విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. చివరకు అది శాంతి భద్రతల సమస్యగా మారడంతో స్పందించిన యంత్రాంగం.. సంప్రదాయ మత్స్యకారుల చేపల వేటను నిషేధించింది.
ఈ నేపథ్యంలో ఆదివారం కలెక్టరేట్‌లో రాష్ట్ర మత్స్య, పర్యాటక, వ్యవసాయశాఖల మంత్రులు సీదిరి అప్పలరాజు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, ఎంపీ వి.విజయసాయిరెడ్డి, కలెక్టర్ ఎ.మల్లికార్జున, సీపీ మనీష్ కుమార్ సిన్హా తదితరులు మత్స్యకారులతో చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి సీదిరి అప్పలరాజు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి 8 కి.మీ. తర్వాత రింగు వలలతో వేట సాగించాలని, గిల్ నెట్లు వినియోగించే మత్స్యకారులు తీరంలో వేట సాగించుకోవచ్చని చెప్పారు.