విశాఖ రైల్వే జోన్ నిర్మాణం ప్రక్రియ మొదలైంది. ప్రాజెక్టు విషయమై ఓఎస్డీ ఎస్. ఎస్. శ్రీనివాస్ తూర్పు-కోస్తా రైల్వే, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో ఇప్పటికే చర్చించారు. నేడు ఆయన దిల్లీలో రైల్వే బోర్డు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. విధివిధానాలతో కూడిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను అక్టోబరు కల్లా రూపొందించే అవకాశముందని సమాచారం.
డివిజన్ల వారీగా సమాచార సేకరణ..
గుంతకల్లు, గుంటూరు, విజయవాడలతో పాటు విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడే దక్షిణ-కోస్తా జోన్లో.. తూర్పు- కోస్తాలోని వాల్తేరు డివిజన్లో కొంత భాగాన్ని కలపనున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. దక్షిణ మధ్య రైల్వేలో ఇక సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే మిగలనున్నాయి. మరోవైపు దక్షిణ- కోస్తాలో వాల్తేరు కొనసాగిస్తూనే..తిరుపతిలో బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వేలో కాజీపేట కొత్త డివిజన్‌గా కావాలని డిమాండ్ వినిపిస్తోంది.
ఆస్తులు..ఆదాయం..ఖర్చులు రైళ్ల రాకపోకలు, నిర్వహణ ఏర్పాట్లు..సదుపాయాలపై డివిజన్ల వారీగా ఓఎస్డీ శ్రీనివాస్ సమాచారం సేకరిస్తున్నారు. వాల్తేరుకు సంబంధించి సమాచార పక్రియ దాదాపు పూర్తైందని తెలుస్తోంది.