కరోనా కష్టకాలంలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సచివాలయ అధికారులు.. కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. విధులకు గైర్హాజరైతే సహించేది లేదని స్పష్టం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు.. జోన్-4 పరిధిలో ఉన్న 38, 39 వార్డులలో వేలంపేట-1, వేలంపేట- 3, అంబు స్వరంగ వీధిలోని పలు సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆయా సచివాలయాల్లో హాజరు పట్టిక, మూమెంట్ రిజిస్టర్, ప్రజలు పెట్టుకున్న అర్జీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన రిజిస్టర్లు తనిఖీలు చేశారు. రికార్డులు సరిగ్గా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజలు మనపై ఎంతో నమ్మకంతో సచివాలయాలకు వస్తారని.. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని.. వారు పెట్టుకున్న అర్జీలను వెంట వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. కొంతమంది వార్డ్ సెక్రటరీలు విధులకు హాజరుకాకపోవడంపై ఆరా తీశారు. సచివాలయ వ్యవస్థను సక్రమంగా ఉపయోగించుకోవాలన్నారు.