కరోనా విజృంభణతో పాఠశాలలు లేని కారణంగా... విశాఖ ఏజెన్సీలో విద్యార్థులు ఇళ్ల పనులు, పొలం పనుల్లో మునిగిపోతున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొందరు ఇంటి నిర్మాణం కోసం రాళ్లు ఎత్తుతుంటే మరికొందరు పశువులు కాస్తున్నారు. కొందరైతే వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయారు. వీరందరిని ఈటీవీ భారత్ పలకరించగా.. పాఠశాలలకు వెళ్లకపోవడం వల్ల చదువుకు దూరమవుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.
నగరాల్లో అయితే తల్లిదండ్రులు వారి పిల్లలకు ఆన్లైన్ క్లాసులు అంటూ మొబైల్ ఫోన్లలో చదివిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో, కొండ గ్రామాల్లో.. మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు. స్మార్ట్ ఫోన్ వాడకం కూడా అంతంత మాత్రమే. ప్రభుత్వ పాఠశాలలు ఆన్లైన్ క్లాసులు మొదలు పెట్టినా చూసే భాగ్యం మన్యం విద్యార్థులకు లేదు. టీచర్, నర్సింగ్ చదువుకున్న వాళ్లు సైతం... పశువులు కాయడం, ఉపాధి పనులు చేస్తున్నారు.
మన్యంలోని చాలా ప్రాంతాల్లో.. బాలబాలికలు వ్యవసాయ పనుల్లో మగ్గిపోవడం.. తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. పశువులను తీసుకుని కొండ ప్రాంతాల్లో రోజంతా ఉండి తిరిగి సాయంత్రం ఇళ్లకు సాయంత్రం చేరుకుంటున్నారు. వారి వద్ద చదువుకునేందుకు పుస్తకాలు కూడా లేకపోవడంతో.. చదువుకు దూరమవుతున్నామని ఆవేదన చెందుతున్నారు.