'స్టైరీన్ తీవ్రత అంచనాకు అధునాతన వ్యవస్థ'
విశాఖ విషవాయువు ఘటనలో స్టైరీన్ తీవ్రత ఎంత ఉందో కచ్చితంగా అంచనా వేసేందుకు అధునాతన మోడలింగ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు హైపవర్ కమిటీ ఛైర్మన్ నీరబ్‌కుమార్ ప్రసాద్ వెల్లడించారు.తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాలను జోన్‌లుగా గుర్తిస్తామన్నారు. ఆయా జోన్లలో భూగర్భజలాలు, భూమి, నీటి వనరులు ఎలా ప్రభావితమయ్యాయో అధ్యయనం చేయిస్తామని స్పష్టం చేశారు.
ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి లీకైన స్టైరీన్ తీవ్రత విశాఖలోని ఏ ప్రాంతంలో ఎంత ఉందో కచ్చితంగా అంచనా వేసేందుకు జీపీఎస్, జీఐఎస్ పరిజ్ఞానం ఆధారంగా అధునాతన మోడలింగ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు హైపవర్ కమిటీ ఛైర్మన్ నీరబ్‌కుమార్ ప్రసాద్ వెల్లడించారు. సోమవారం హైపవర్ కమిటీ సభ్యులు విశాఖలోని జీవీఎంసీ సమావేశ మందిరంలో జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, కర్మాగారాలు, ఎన్.డి.ఆర్.ఎఫ్., అగ్నిమాపక, పరిశ్రమలు తదితరశాఖల అధికారులు, కృష్ణా విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య రామకృష్ణారావు, పలువురు ఉద్యోగులతో సమావేశమయ్యారు.
- ఎల్‌జీ నుంచి లీకైన స్టైరీన్.. గాలి దిశ, వేగాన్నిబట్టి కొన్నిచోట్ల ఎక్కువగా, మరికొన్నిచోట్ల తక్కువగా ప్రభావం చూపించింది. తాజా మోడలింగ్‌లో తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్‌జోన్‌గా, ఒకింత తక్కువగా ఉంటే ఆరంజ్ జోన్‌గా, ఇంకా తక్కువ ప్రభావం ఉన్నవాటిని పసుపు జోన్‌లుగా గుర్తిస్తాం. ఆయా జోన్లలో భూగర్భజలాలు, భూమి, నీటి వనరులు ఎలా ప్రభావితమయ్యాయో అధ్యయనం చేయిస్తాం.
- స్టైరీన్ ప్రభావం..మనుషులతోపాటు పర్యావరణం, ఇతర జీవరాశులపై ఎలా ఉందో అధ్యయనం చేస్తున్నాం. పశువుల్లో అనారోగ్య లక్షణాలపై పశుసంవర్థకశాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారు.* బాధిత గ్రామాల్లో ప్రజల కళ్లు, ఊపిరితిత్తులు, చర్మం, ఉదరకోశ సమస్యలు, చిన్నపిల్లల వ్యాధులు, మహిళలు ఎదుర్కొనే సమస్యలపై అధ్యయనం చేయిస్తాం. ప్రతి ఒక్కరికీ నెలకోసారి చొప్పున 12 నెలలపాటు వైద్య పరీక్షలు చేయించి ఫలితాలను అధ్యయనం చేస్తాం. ఇందుకోసం ఆంధ్ర వైద్యకళాశాల నుంచి ఉన్నతస్థాయి వైద్య బృందం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది.
- హైపవర్ కమిటీకి ఫోన్, మెయిల్ ద్వారా దాదాపు నాలుగు వందలకు పైగా ప్రజలు స్పందించారు. వారిచ్చిన సూచనలు ఆధారంగా సుమారు 200 ప్రశ్నలకు ఎల్‌జీ పాలిమర్స్ ప్రతినిధుల నుంచి సమాధానాలు రాబడుతున్నాం.
- జీవీఎంసీ, బౌల్‌ఏరియా పరిధిలో ఉన్న రెడ్ కేటగిరీ పరిశ్రమలను, వాటివల్ల పొంచి ఉన్న ముప్పును గుర్తించాలని అధికారులకు సూచించాం.