విశాఖపట్నంలో ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీక్ అవడంతో నగరం ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయింది. ఆర్.ఆర్.వెంకటాపురం పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ నుంచి 3 కిలోమీటర్ల మేర వాయువు వ్యాపించింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గ్యాస్ లీక్ అవగా.. అప్పటికి అంతా నిద్రమత్తులో ఉన్నారు. రసాయన వాయువు ప్రభావంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. నిద్ర నుంచి తేరుకున్న వారు రోడ్లపైకి పరుగులు తీశారు.
ఏం జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈక్రమంలో కొందరు అపస్మారక స్థితికి చేరుకుని రోడ్లపైనే పడిపోయారు. ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తే క్రమంలో గంగరాజు అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు. మరికొందరు బయటకు రాలేక ఇళ్లలోనే ఉండిపోయారు. పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలను అధికారులు ఇతర ప్రాంతాలకు తరలించారు.ఈ గ్యాస్ లీక్ ప్రభావానికి సంబంధించిన విజువల్స్ ఏరియల్ వ్యూ ద్వారా చూద్దాం.