ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భీమిలిలో 'భూ'చోళ్లు.. దేవాదాయ భూములకు 'టెండర్'!

పాలనా రాజధానిగా ప్రచారమవుతున్న విశాఖలోని భీమిలి ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరా రూ.కోట్లలో పలుకుతోంది. అలాంటి చోట దేవాదాయశాఖకు చెందిన విలువైన భూములను తక్కువ లైసెన్సు ఫీజుతో కొట్టేసేందుకు కొందరు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు.

vishaka district lands
vishaka district lands

By

Published : Jan 31, 2020, 5:16 AM IST

Updated : Jan 31, 2020, 7:29 AM IST

భీమిలిలో 'భూ'చోళ్లు.. దేవాదాయ భూములకు 'టెండర్'!

పాలనా రాజధానిగా ప్రభుత్వం పేర్కొంటున్న విశాఖపట్నం జిల్లాపై భూచోళ్లు వాలారు. ఇటీవల దేవాదాయశాఖ జారీ చేసిన సర్క్యులర్​ అడ్డుపెట్టుకుని భీమిలిలో ఆ శాఖకు చెందిన రూ.300 కోట్ల విలువైన భూమిని గుట్టుచప్పుడు కాకుండా.. కారు చౌకగా.. లైసెన్సు పేరుతో కొట్టేసేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటిదాకా ఈ భూములను లీజుకు కేటాయిస్తుండగా కొత్త నిబంధనల ప్రకారం.. లైసెన్సు ఫీజుతో భూములను వినియోగించుకోవచ్చు. దీనినే అడ్డం పెట్టుకుని కొందరు ఈ భూములపై కన్నేశారు.

భీమిలి నుంచి తగరపువలస వెళ్లే మార్గంలో భీమిలికి 3 కి.మీ. దూరంలో చిల్లపేట గ్రామ పరిధిలో సర్వే నంబరు 67/1లో దేవాదాయశాఖ పరిధిలో ఉండే లంగర్‌ఖానా చౌల్ట్రీకి 67 ఎకరాల భూమి ఉంది. దీని విలువ రూ.300 కోట్ల వరకూ ఉంటుందని దేవాదాయశాఖ అంచనా. ఇలాంటి భూమికి 11 ఏళ్లకు లైసెన్సు జారీ (ఇంతకు ముందు లీజు విధానం ఉండేది) కోసం అక్కడి దేవాదాయశాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు అంతగా సర్క్యులేషన్‌ లేని పత్రికలో, అదీ భీమిలి నియోజకవర్గ పరిధిలో మాత్రమే ప్రచురితమయ్యేలా ఒక ప్రకటన ఇచ్చారు. వేలం, సీల్డ్‌ టెండర్‌ద్వారా ఎవరైనా పాల్గొనవచ్చని అందులో పేర్కొన్నారు. దేవాదాయశాఖ కొత్తగా తెచ్చిన నిబంధనల ప్రకారం అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న పత్రికల్లోనూ, ఇతర జిల్లాల్లోనూ ప్రకటన ఇవ్వాలి. వేలం, సీల్డ్‌ టెండర్‌తోపాటు ఈ-టెండరు పిలవాలి. విలువైన స్థలాల్లో మూడెకరాలకు మించి ఒక్కరికే లైసెన్సు జారీ చేయొద్దని కొద్ది రోజుల కిందటే అన్ని ఆలయాల అధికారులకు ఆ శాఖ కమిషనరేట్‌ నుంచి ఆదేశాలు వెళ్లాయి. భీమిలిలో మాత్రం ఈ నిబంధనలన్నింటినీ పక్కన పెట్టేశారు.

అంత రహస్యమెందుకు?

ఈ-టెండరు వల్ల ఎక్కువ మంది పోటీదారులు వస్తారు. అధిక సర్క్యులేషన్‌ ఉండే పత్రికల్లో ప్రకటన ఇస్తే మరింత మంది టెండరులో పాల్గొని ఎక్కువ లైసెన్సు ఫీజు చెల్లించేందుకు ముందుకు వస్తారు. తద్వారా దేవాదాయశాఖకు అధిక ఆదాయం వస్తుంది. అక్కడి అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు. ఎక్కువ విస్తీర్ణం ఉండే స్థలాల టెండరు, వేలానికి సంబంధించి కమిషనర్‌ అనుమతి కూడా అవసరం. దీనిపై భీమిలిలోని అధికారులు, కమిషనరేట్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. వాస్తవానికి కొద్ది రోజులుగా ఈ భూమిని తీసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వారే పెద్ద ఎత్తున మంత్రాంగం నడుపుతున్నారు. మరోవైపు దేవాదాయ శాఖ అధికారులు సైతం తమ శాఖకు చెందిన భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోకుండా గతంలో ఉన్న 33 ఏళ్ల లీజు విధానాన్ని తొలగించి కొత్తగా 11 ఏళ్ల వరకు లైసెన్సు జారీ ప్రక్రియను చేపట్టారు. నియమ నిబంధనలపై కసరత్తు చేస్తున్నారు. ఇంతలోనే భీమిలిలో భూమిని చౌకగా కొట్టేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీని కోసం స్థానిక అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. వారు చాలారోజులు పెండింగ్‌లో ఉంచినా ఒత్తిళ్లు పెరగడంతో చివరకు 3 రోజుల కిందట పత్రికా ప్రకటన ఇచ్చారు. అయితే అదేరోజు దేవాదాయశాఖ కమిషనరేట్‌ నుంచి భూముల లైసెన్సు జారీ నిబంధనలను తెలియజేస్తూ అధికారులందరికీ ఉత్తర్వులు అందాయి. ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించి పిలిచిన ఆ టెండరును రద్దు చేస్తారా? లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇదీ చౌల్ట్రీ భూముల కథ

భీమిలిలో 16వ శతాబ్దంలో పోర్టు మొదలై 1933 వరకు కొనసాగింది. 1933లో విశాఖ పోర్టు ఏర్పడటంతో భీమిలి పోర్టు ప్రాభవం తగ్గి క్రమంగా 1964లో మూసేశారు. గతంలో ఈ పోర్టులో పనిచేసే కార్మికులకు భోజనం పెట్టేందుకు లంగర్‌ఖానా చౌల్ట్రీ ఏర్పడింది. దీనికి ఆంగ్లేయులు, దాతలు భూములిచ్చారు. పోర్టు మూతపడటంతో చౌల్ట్రీ కూడా ప్రాభవం కోల్పోయింది. దీనికి పెద్ద ఎత్తున భూములున్నాయి. ఇవన్నీ దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తాయి. ఇందులో ఒకేచోట ఉన్న 67 ఎకరాలను కొందరు చౌకగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న వైనం తాజాగా వెలుగుచూసింది.

ఇదీ చదవండి: జనసేనకు లక్ష్మీనారాయణ రాజీనామా

Last Updated : Jan 31, 2020, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details