జీవీఎంసీ, ఎలమంచిలి, నర్సీపట్నం మున్సిపాల్టీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. గురువారం వీఎంఆర్‌డీఏ బాలల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బ్యాలెట్ పత్రం చెల్లుబాటు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సూచించారు. వీటికి సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. లెక్కింపు ప్రక్రియలో తెలిసీతెలియక తప్పు చేసినా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించి... ఆ తరువాత మిగిలిన పెట్టెల్లోని ఓట్లు లెక్కించాలని కలెక్టర్ వినయ్‌చంద్ సూచించారు. రౌండ్ల వారీ లెక్కింపులో పొరపాట్లు రాకుండా చూసుకోవాలన్నారు.