అసనగిరి..నాతవరం మండలంలో ఎత్తైన పర్వతశ్రేణిలో దాదాపు రెండొందల జనాభా కలిగిన గిరిజన పల్లె. సుందరకోట పంచాయతీలో శివారు గ్రామం. అడవే అక్కడివారికి జీవనాధారం. ఇక్కడ చెట్లను దేవతా స్వరూపంగా కొలుస్తుంటారు. బయటి ప్రపంచానికి ఇంకా పరిచయం కాని గుహలు అక్కడ ఉన్నాయి. తెల్లదొరల పాలనపై విల్లెత్తిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఈ గుహల్లో అప్పుడప్పుడు బసచేసేవారని గిరిజనుల నమ్మకం.
ఈ పచ్చని అడవిలోని ఎర్రకొండపై కొందరి కన్ను పడింది. 2009లో 90 ఎకరాల్లో లేటరైట్ తవ్వకాల కోసం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళతో దరఖాస్తు చేయించారు. 2016లో తవ్వకాలకు అనుమతులు వచ్చేశాయి. అయితే లీజుదారుడిని మాత్రం కొండ దరిదాపులకు కూడా రానివ్వకుండా స్థానికులంతా ఒక్కటై అడ్డుకున్నారు. లీజు రద్దయ్యేవరకు న్యాయ పోరాటం చేయడంలో అసనగిరి యువత ఆదర్శంగా నిలిచారు. అదే స్ఫూర్తితో బమిడికలొద్ది క్వారీపైనా తాజాగా కొంతమంది గిరిజనులు పోరాటం చేస్తున్నారు.
ఏకతాటిపై నిలిచి..
లేటరైట్ ఖనిజం కొండలపై భాగంలోనే ఉంటుంది. పైన తవ్వితే వచ్చే ధూళి చుట్టుపక్కల చెట్లను పాడు చేస్తుంది. సహజంగా ప్రవహించే నీటి ఊటలు దెబ్బతింటాయి. తద్వారా పంటలు పాడవుతాయి. ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి, ఇక్కడి అటవీ సంపద మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్న వారికి ఇబ్బందులు ఎదురవుతాయని స్థానికంగా ఉన్న యువకులు గ్రహించారు. గ్రామంలోని అన్ని కుటుంబాలనూ ఒక్కతాటిపైకి తెచ్చారు. లేటరైట్ తవ్వకాలను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. తెలిసినవారి సహాయం తీసుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తవ్వకాలు మొదలైతే ఇక్కడి సహజ గుహలు కనుమరుగవుతాయని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. కొన్నాళ్లలోనే వీరి ప్రయత్నం సఫలీకృతమైంది. లీజు రద్దు దిశగా అధికారులు చర్యలు తీసుకున్నారు.
తవ్వకాలతో నష్టమే ఎక్కువ
లేటరైట్ తవ్వితే నీటి ఊటలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. నీరు లేకపోతే మనుగడ కష్టమవుతుంది. లేటరైట్ తవ్వితే వచ్చే లాభాలు, జరిగే నష్టాలపై అంతా కలిసి మాట్లాడుకున్నాం. నష్టాలే ఎక్కువ కనిపించాయి. అందుకే ఎలాగైనా పోరాడి పరిసరాలను కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాం.
- పాండవుల నూకరాజు, అసనగిరి