ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేరాల నియంత్రణకు విశాఖ పోలీసుల వినూత్న యత్నం - ఫ్రెండ్లీ పోలీసింగ్​

నేరాలకు అడ్డుకట్ట వేసి.. ప్రజల్ని అప్రమత్తంగా ఉంచేందుకు విశాఖ పోలీసులు నూతన పద్ధతిని ప్రారంభించారు. 'బ్రౌజ్ సేఫ్ - బీ సేఫ్', 'సేఫ్ ఆటో', 'మన ఇల్లు - మన బాధ్యత' అనే నినాదాలతో అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలను బాధ్యతాయుతులుగా తీర్చిదిద్దనున్నారు. ఈ కార్యక్రమాలతో నేరాలు తగ్గుముఖం పడతాయని పోలీసులు భావిస్తున్నారు.

visakhapatnam police new strategies over reducing crime rate in town
విశాఖపట్నం పోలీసులు

By

Published : Dec 24, 2020, 2:37 PM IST

నేరాల నియంత్రణ దిశగా విశాఖ పోలీసులు వినూత్న పద్ధతిని అవలంబిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్​ మొదలు అన్ని విషయాలపై అవగాహన కలిగించడం, అప్రమత్తత పెంచడం, బాధ్యతగా తీర్చిదిద్దడం వంటి అంశాలకు పెద్ద పీట వేస్తున్నారు. ఆ దిశగా అధిక నేరాలు జరుగుతున్న అంశాలను లక్ష్యంగా చేసుకుని మూడు ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడం, ఆటో రవాణా వ్యవస్థను సురక్షితంగా మలచడం కమ్యునిటీ భాగస్వామ్యంతో నిఘా పటిష్టం చేయడం వంటి లక్ష్యాలను విశాఖ పోలీసులు నిర్దేశించుకున్నారు.

ఈ అంశాలలో నేరాలను పూర్తి స్థాయిలో నియంత్రించే దిశగా 'బ్రౌజ్ సేఫ్ - బీ సేఫ్' , 'సేఫ్ ఆటో', 'మన ఇల్లు - మన బాధ్యత' కార్యక్రమాలను పోలీసులు ప్రారంభించారు. నేరాలు జరగకుండా నియంత్రించే దిశగా పోలీసు శాఖ పనిచేయనున్న తీరుకు ఈ నినాదాలు అద్దం పడుతున్నాయి. మరోవైపు.. సామాజిక మాధ్యమాల ద్వారా నగరాన్ని సురక్షితంగా నిలిపే దిశగా ప్రజలకు సందేశాత్మక, అవగాహన కలిగించే వీడియోలను సైతం పోలీసులు ప్రచారం చేస్తున్నారు.

'బ్రౌజ్ సేఫ్ - బీ సేఫ్'

ప్రజల అమాయకత్వాన్ని, అవగాహన లోపాన్ని అదనుగా మలచుకుని చేసే సైబర్ మోసాలపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కళాశాలలతో పాటు కాలనీలు, అపార్టుమెంట్ల వద్ద ప్రజలకు సైబర్ నేరాల తీరును వివరించనున్నారు. ఫలితంగా సైబర్ నేర గాళ్ల ఉచ్చులో ప్రజలు చిక్కుకోకుండా అప్రమత్తం చేయాలనే లక్ష్యంతో నగర పరిధిలోని 23 పోలీసు స్టేషన్ల సిబ్బందికి ఈ తరహా అవగాహనను ప్రజల్లో కలిగించాల్సిన ఆవశ్యకతపై దిశా నిర్దేశం చేశారు.

'సేఫ్ ఆటో'

ఆటో వ్యవస్థను సురక్షితంగా తీర్చిదిద్దడంపైనా పోలీసులు దృష్టి సారించారు. గుర్తింపు పొందిన ఆటో డ్రైవర్​లకు మాత్రమే రాత్రి వేళ ప్రజా రవాణా చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఆ దిశగా వెరిఫైడ్ నైట్ సర్వీస్ ఆటో గుర్తింపును సదరు డ్రైవర్లకు ఇవ్వనున్నారు. సుమారు 6 వేల మంది గుర్తింపు కలిగిన ఆటో డ్రైవర్లు విశాఖలో ఉన్నారు. వీరిని కమ్యునిటీ పోలిసింగ్​లో భాగస్వామ్యం చేసి ఇతరుల నేర స్వభావాన్ని, నేరం చేయాలన్న ఆలోచనల్ని కట్టడి చేసే దిశగా బలమైన వ్యవస్థను రూపొందించాలని పోలీసులు భావిస్తున్నారు.

'మన ఇల్లు- మన బాధ్యత'

మన ఇల్లు -మన బాధ్యత కార్యక్రమం ద్వారా కాలనీలు, అపార్టుమెంట్లు వద్ద ప్రైవేటు సెక్యురిటీ ఏర్పాటును ప్రోత్సహించనున్నారు. నైట్ బీట్ వ్యవస్థను మరింత విస్తృతం చేసి... సదరు భద్రతా సిబ్బందితో పోలీసులు కలిసి పని చేసే దిశగా కార్యాచరణ అమలు చేయనున్నారు.

ఇదీ చదవండి:

విశాఖ జిల్లాలో రూ.3.85 కోట్ల గంజాయి స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details