TWO DAYS CUSTODY TO VISAKHA MARGADARSI MANAGER: విశాఖ సీతంపేట మార్గదర్శి శాఖ మేనేజర్ కె.రామకృష్ణను 5రోజుల కస్టడీ కోరుతూ.. విశాఖ మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయస్థానంలో సీఐడీ అధికారులు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. రామకృష్ణ తరఫున న్యాయవాదులు ఎం.రవి, టి.సత్యశ్రీకాంత్ వాదనలు వినిపించారు. నిరాధార ఆరోపణలపై నమోదు చేసిన కేసుకు కస్టడీ అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఎం.తిరుమలరావు.. రెండు రోజుల కస్టడీకి అనుమతించారు.
న్యాయవాదుల సమక్షంలోనే ఆయనను విచారించాలని ఆదేశాలు ఇచ్చారు. రాజమహేంద్రవరం మార్గదర్శి బ్రాంచి మేనేజర్ సత్తి రవిశంకర్ కేసును కాకినాడ కోర్టుకు బదిలీ చేస్తూ.. ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఆదివారం అర్ధరాత్రి నిర్ణయం వెలువరించారు. ఆ తర్వాత రవిశంకర్‌ను సోమవారం వేకువజామున 3గంటల30 నిమిషాలకు కాకినాడ తరలించి... ఉదయం నాలుగున్నరకు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. 15 రోజుల రిమాండ్‌కు ఇవ్వాలని కోరారు. పత్రాలు పరిశీలించిన న్యాయమూర్తి.. చిట్‌ఫండ్ చట్టం ప్రకారం ఇలాంటి కేసుల్లో నిందితులను జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలని సూచిస్తూ ఒక రోజు రిమాండ్ విధించారు.
సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరిచి పత్రాలు తీసుకువెళ్లాలని సూచించారు. సోమవారం ఉదయం 9.50 గంటల వరకు మేనేజర్ సత్తి రవిశంకర్‌ను కాకినాడలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఉంచారు. అనంతరం అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి పత్రాలు తీసుకున్నారు. కొవిడ్ పరీక్షల తర్వాత రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. ఏలూరు మార్గదర్శి కార్యాలయంలో మూడో రోజు కూడా సీఐడీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోమవారం మార్గదర్శి కార్యాలయానికి సెలవు. అయినా ఉదయం 9 గంటలకు రావాలంటూ సిబ్బందికి సీఐడీ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. రాత్రి వరకు తనిఖీలు నిర్వహించారు.