POLICE GAVE NOTICES TO PAWAN : జనవాణి కార్యక్రమం నిర్వహించేందుకు విశాఖ వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పోలీసులు నోటీసులిచ్చారు. విశాఖలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం సహా ఇతర అంశాలను ప్రస్తావించారు. పోలీసు యాక్టు 30 ప్రకారం.. అమలులో ఉన్న నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ పవన్ కల్యాణ్ ప్రవర్తించారంటూ.. నోటీసుల్లో పేర్కొన్నారు. విమానాశ్రయం వద్ద మంత్రుల కారుపై దాడి సహా ఇతర ఘటనలు.. పవన్ నాయకత్వం వల్లనే జరిగాయని నోటీసుల్లో రాశారు. ఈ నోటీసును మీడియా సమక్షంలోనే తీసుకున్న పవన్... ఆ దాడికి, తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
ప్రశ్నించే తత్వం లేకపోతే దోపిడీలు ఎక్కువైపోతాయి: ప్రజల కోసం పోరాడితే పోలీసులు నోటీసులు ఇస్తున్నారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మేము విశాఖ రాకముందే గొడవ జరిగిందని.. మేము వచ్చి రెచ్చగొట్టడం వల్లే జరిగిన విధంగా పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. ఏ పార్టీ కూడా ఇతర పార్టీలు ఎదగడానికి సహకరించరని.. మాకు వస్తోన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంమన్నారు. ఉత్తరాంధ్ర దోపిడీని చూపిస్తామనే కారణంతో డ్రోన్లను నిషేధించారని.. ప్రశ్నించే తత్వం లేకపోతే దోపిడీలు ఎక్కువైపోతాయని తెలిపారు. నేర చరిత గల నేతలు పోవాలంటే ప్రజల్లో మార్పు రావాలని సూచించారు. ప్రజల్లో మార్పు వచ్చే వరకు మేము పోరాడుతామని స్పష్టం చేశారు.
ప్రజల కోసం పోరాడేవారి గొంతు నొక్కాలని చూస్తున్నారు: అంతకుముందు మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే కుట్రతోనే.. దాడి అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితమే నిర్ణయించిన జనవాణి కార్యక్రమాన్ని.. విశాఖ గర్జనకు పోటీగా పెట్టామని ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. పోలీసు ఉన్నతాధికారులు తమ పట్ల వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉందని పవన్ ఆక్షేపించారు. అవినీతిపరులకు, నేరగాళ్లకు కొమ్మకాస్తున్న పోలీసులు.. ప్రజల కోసం పోరాడేవారి గొంతు నొక్కాలని చూస్తున్నారని విమర్శించారు.