వచ్చే నెల 20వ తేదీ నుంచి జరగనున్న వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాలకు సంబంధించి పరీక్షల ఏర్పాట్లపై విశాఖ జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. లక్షన్నరకు మించి అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల ఎంపిక నుంచి అవసరమైన మానవ వనరుల సమీకరణ కోసం అధికారులు ఆచితూచి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
మునుపటిలాగే పరీక్షలకు సంబంధించి గదికి 25 నుంచి 30 మందిని కూర్చోబెట్టి పరీక్ష రాయించే పరిస్థితి లేదు. కరోనా వైరస్ లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లాలో ఇప్పటికే ఎంపీడీవోలు పరీక్షల నిర్వహణకు అనువుగా ఉన్న 324 కేంద్రాలను గుర్తించారు. వాటిని తొమ్మిది క్లస్టర్లుగా విభజించి ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు.
గత ఏడాది మొదటి నోటిఫికేషన్‌తో జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 10, 892 పోస్టులను భర్తీ చేశారు. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు ఒకరే నాలుగైదు ఉద్యోగాలకు ఎంపిక కావడం, వివిధ కారణాలతో రాజీనామాలు చేయడం ద్వారా 1,585 పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిలో ఒక గ్రామ సచివాలయం పోస్టులు 1199 ఉంటే, వార్డు సచివాలయాల్లో 386 ఖాళీలు ఉన్నాయి. వీటికి ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్ జారీ చేశారు. లక్షా యాభై ఆరు వేల 318 మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖ జిల్లా అభ్యర్థులు పోటీపడుతున్నారు. సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు రోజుకి రెండు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్ వినయ్‌చంద్ నేతృత్వంలో పరీక్షల ఏర్పాట్లపై కసరత్తు జరుగుతోంది.
సెప్టెంబర్ 20న ఉదయం పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-5), మహిళా పోలీస్, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్ష జరగనుంది. వీటికే 73వేల 246 మంది దరఖాస్తు చేశారు. అదే రోజు మధ్యాహ్నం డిజిటల్ అసిస్టెంట్ పోస్టుకు పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి 21 వేల 296 మంది హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం అన్ని పోస్టులకు 1.56 లక్షల మంది పోటీపడితే తొలిరోజే 94 వేల మందికిపైగా అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారు. మిగతా అయిదు రోజులు 62 వేల మంది పరీక్షలు రాయనున్నారు. ఇదివరకు బెంచ్‌కు ఇద్దరు అభ్యర్థులు చొప్పున కూర్చోబెట్టేవారు. ఇప్పుడు నిర్వహించబోయే పరీక్షల్లో బెంచ్‌కు ఒక అభ్యర్థినే అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి:సాంకేతికత వినియోగంలో మేటి కానీ... పాలనలో పారదర్శకతలేదు