Visakha Dasapalla lands are 22A: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన.. దసపల్లా భూముల స్వాహాకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. దీనిపై కీలక నిర్ణయం తీసుకొనే దిశగా అధికార యంత్రాంగం పావులు కదుపుతోంది. ఈనెల 13న ప్రధానమంత్రి మోదీ విశాఖ పర్యటన సందర్భంగా.. విశాఖలో బస చేసిన వైకాపా ముఖ్యనేత.. అధికారులతో ఈ భూముల డీనోటిఫికేషన్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.. దీంతో యంత్రాంగం రంగంలోకి దిగింది. కలెక్టర్ మల్లికార్జున, జేసీ విశ్వనాథన్, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్‌లతో పాటు జీవీఎంసీ, రెవెన్యూ, వీఎంఆర్‌డీఏ, సర్వేశాఖ అధికారులు 1027, 1028, 1196, 1197 సర్వే నంబర్లలో విస్తరించి ఉన్న 60 ఎకరాల దసపల్లా భూములను పరిశీలించారు.
వాటిలో కొన్నింటిని ఇప్పటికే సేకరించి పరిహారం చెల్లించారు. అలా సేకరించిన భూమి 40 ఎకరాల వరకు ఉంది. అవి ఎక్కడ ఉన్నాయి? రాణి కమలాదేవి నగరంలో 65 మందికి విక్రయించిన భూములు ఎక్కడ ఉన్నాయి? గవర్నర్ బంగ్లా, నౌకాదళ భవనానికి చెందిన స్థలాలు ఏయే సర్వే నంబర్లలో విస్తరించి ఉన్నాయి? జీవీఎంసీ నిర్మించిన రెండు నీటి ట్యాంకులు, సులభ్ శౌచాలయం, వీఎంఆర్‌డీఏ వేసిన రోడ్లు, పార్కులు ఏయే సర్వే నంబర్లలో ఉన్నాయో తేల్చాల్సి ఉంది. ఇవి తేలాలంటే సబ్ డివిజన్ పనులు పూర్తి కావాలి. దీంతో ఆగమేఘాలపై ఇటీవల సబ్ డివిజన్ పనులు పూర్తి చేశారు.
నాలుగైదు రోజుల నుంచి కలెక్టర్, జేసీలు తరచూ జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, సర్వేశాఖ అధికారులతో భేటీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇంతకన్నా కీలకమైన పనులు ఉన్నప్పటికీ.. ప్రభుత్వ పెద్దల నుంచి గట్టి ఆదేశాలు రావడంతో ఇదే పనిలో నిమగ్నమయ్యారు. బుధవారం కలెక్టర్ మల్లికార్జున, జేసీ.. దసపల్లా భూముల్లో జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ భవనాలు, పార్కులు, రహదారులు, ఇతర కట్టడాల వివరాలను అందజేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఆయా వివరాలు అందిన వెంటనే ప్రభుత్వ ఆస్తులను 22ఏలో ఉంచి, మిగిలిన భూములను మినహాయించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ కసరత్తు నాలుగైదు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం కలెక్టర్ దసపల్లా భూములను డీనోటిఫై చేసి ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉందని చెబుతున్నారు.