విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల పరిరక్షణ కమిటీ నిర్ణయించింది. కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడంపై వెనక్కి తగ్గకపోవడంతో కార్మిక, ప్రజాసంఘాలు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి నిర్ణయించాయని కమిటీ ఛైర్మన్ ఎం. జగ్గునాయుడు తెలిపారు. ఈ మేరకు ఈనెల 20న పెద్ద ఎత్తున 'చలో స్టీల్ ప్లాంట్' నిర్వహించనున్నామని.. 26న భారత్ బంద్కు పిలుపునిచ్చామని అన్నారు.
ఉద్యమంలో భాగంగా ఈనెల 30 నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నామని జగ్గు నాయుడు ప్రకటించారు. సమావేశంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎన్. మన్మదరావు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ జేఏసీ నాయకుడు ఎస్కే రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.