ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.. ప్రధానిని సీఎం ఒప్పించాలి" - విశాఖ స్టీల్​ ఫ్లాంట్

Vizag Steel Plant: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. ఈ నెల 11, 12 తేదీలలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నిరసన చేపట్టనుంది. ఈ మేరకు విశాఖలోని కూర్మనపాలెం జంక్షన్​ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నిరసన కార్యక్రమాలు చేపట్టనుందని పరిరక్షణ సమితి నేతలు తెలిపారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ఈ నిరసనలు చేస్తున్నామని వారు తెలిపారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Nov 10, 2022, 4:21 PM IST

Updated : Nov 10, 2022, 9:59 PM IST

Visakha steel Plant: ఓ వైపు విశాఖలో ప్రధాని మోదీ పర్యటన కోలాహలం నెలకొంటే మరోవైపు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల పోరు ఉద్ధృతమైంది. స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరణను నిలిపివేస్తామని విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ ప్రకటించాలని ఉక్కు పరిరక్షణ సమితి నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానిపై ఒత్తిడి పెంచేందుకు రేపు, ఎల్లుండి పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు. సీఎం జగన్ కూడా స్టీల్ ప్లాంట్ ఆవశ్యకతను ప్రధానికి వివరించి ప్రభుత్వరంగంలోనే కొనసాగించేలా ఒప్పించాలని కోరారు.

"విశాఖ స్టీల్​ ఫ్లాంట్​ ప్రైవేటీకరణ నిర్ణయం తర్వాత మోదీ మెట్టమొదటి సారి విశాఖ వస్తున్నారు. రాష్ట్రంలోని అత్యంత మణి కీరిటమైనటువంటి విశాఖ స్టీల్​ ఫ్లాంట్​ను అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇటీవల కాలంలో టన్ను స్టీల్​ పదివేల రూపాయలు ఉంటే.. ఆ టైములో ఫ్లాంట్​ను బలహీనం చేయటానికి 50శాతం ఉత్పత్తి తగ్గించారు. అలా కాకుండా నూరు శాతం ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. అది కూడా ప్రకటించాలి. ఇదేగానీ మాట్లాడకపోతే ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు రావటం దండగా. మాకు ఏమి ఇస్తారని, ఏమి తేస్తున్నారని మేము అడగము. కానీ, మాకు ఉన్నదాన్ని తీసుకువెళ్లకూడదని.. తీసుకవెళ్లే మీకు హక్కు లేదు". - నర్సింగరావు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేత

స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోరుతూ కార్మికులు అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.... తమ అభీష్టాన్ని తెలిపేలా పోరు మరింత ఉద్ధృతం చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణను ఉపసంహరిస్తామని.... ప్రధాని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఆవశ్యకత మోదీకి తెలిసేలా రేపు, ఎల్లుండి పెద్దఎత్తున నిరసనలకు ఉక్కుపోరాట సమితి పిలుపునిచ్చింది.

"ఇదే ప్రధానమంత్రి విశాఖ స్టీల్​ ఫ్లాంట్​ 2015 ఎన్నికల పర్యటనకు వచ్చినపుడు విశాఖ స్టీల్​ఫ్లాంటుకు ఉక్కుగనులను కేటాయిస్తామని ప్రకటించారు. ఇనుప గనులు కేటాయించకపోగా.. నూటికి నూరు శాతం స్టీల్​ ఫ్లాంట్​నే అమ్ముతామంటున్నారు. విశాఖకు మీరు వస్తున్నారు కాబట్టే.. మేము ఈ నిరసనలు, ధర్నాలు చేస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని రాజకీయ పార్టీలు చేసినటువంటి తీర్మానాన్ని.. అది 6కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవమైనటువంటి తీర్మానం. దాని ప్రకారం ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి ప్రశ్నించాల్సిందే. అలాగే విశాఖ కార్పొరేషన్​లో చేసినటువంటి తీర్మానం.. అన్ని రాజకీయ పార్టీలు, మీ పార్టీ కూడా కలిసి చేసింది. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని మీరు హెచ్చరించాల్సిందే". - విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేత

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం శాంతియుత ర్యాలీలు చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడం సరికాదని పోరాట సమితి నేతలు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధమని ప్రకటించారు.

"రేపు విశాఖ స్టీల్​ ఫ్లాంట్​ ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులు, కాంట్రాక్టు కార్మికులు విధులు బహిష్కరించి.. ప్రతి ఒక్కరూ నిరసన కార్యక్రమం చేపట్టాలి. 11, 12 తేదీలలో కూర్మనపాలెం జంక్షన్​ వద్ద నిరసనలుంటాయి."- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేత

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై అఖిలపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నేతలు నిరసన తెలిపారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామని నేతలు తెలిపారు. స్టీల్ పరిశ్రమ ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా ప్రధాని విశాఖ పర్యటనలో సీఎం జగన్ ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైల్వే జోన్‌పై కూడా ప్రధాని స్పష్టతనివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.. ప్రధానిని సీఎం ఒప్పించాలి

ఇవీ చదవండి:

Last Updated : Nov 10, 2022, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details