విశాఖ దక్షిణ నియోజకవర్గ ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. నగర పరిధిలో ఇతర నియోజకవర్గాలతో పోల్చితే ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులతోపాటు స్వతంత్రులకు పట్టం కట్టారు. నియోజకవర్గ పరిధిలోని 13 వార్డులను కైవసం చేసుకొనేందుకు వైకాపా వ్యూహాలు రచించినా అయిదు చోట్లే విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేసిన వాసుపల్లి గణేష్‌కుమార్ 3,500 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన ఆరు నెలల క్రితం తెదేపాను వీడి వైకాపాలో చేరారు. దీంతో వైకాపా బలం దక్షిణంలో గణనీయంగా పెరిగిందని, 10కుపైగా వార్డుల్లో విజయం సాధిస్తామని ఆ పార్టీ నేతలు భావించారు. చివరి నిమిషం వరకు అభ్యర్థులను తేల్చలేకపోయారు. రెబెల్స్‌ను బరిలో నుంచి తప్పించడంలో నేతలు చొరవ చూపలేదు. దీంతో 29, 30, 34, 36, 37 వార్డుల్లో మాత్రమే విజయం సాధించగలిశారు.
వైకాపాకు పట్టు ఉన్న 39, 35, 32 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. 35వ వార్డులో వైకాపా అభ్యర్థి ఏకంగా మూడో స్థానంలో నిలిచారు. 33వ వార్డులో జనసేన అభ్యర్థి చేతిలో పరాజయం పొందారు. 39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి చేతిలో 18 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. తెదేపా నాలుగు స్థానాలతో సరిపెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధించిన తెదేపా రెండేళ్ల తర్వాత మరింత దిగువకు జారిపోయింది. తెదేపా 31, 36, 27, 41 వార్డుల్లో మాత్రమే గెలిచింది. వాసుపల్లి పార్టీని వీడిన తర్వాత నియోజకవర్గ బాధ్యుడిని ఇంతవరకు నియమించలేదు. పార్టీ నేతల మధ్య సమన్వయలేమి, అభ్యర్థుల ఎంపికలో సరైన విధానం పాటించకపోడం చేటు తెచ్చింది.