Vakapalli Rape Case : విశాఖ ఉమ్మడి జిల్లాలోని జి.మాడుగుల మండలం గిరిజన ప్రాంతంలోని నుర్మతి పంచాయతీ వాకపల్లి గ్రామంలో 2007 ఆగస్టు 21న ఉదయం నక్సలైట్ల ఏరివేతలో భాగంగా గ్రేహౌండ్ పోలీసులు కూంబింగ్‌ను నిర్వహించారు. గ్రామంలో ఒంటరిగా ఎదురు పడిన తమపై గ్రేహౌండ్ పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారని 11 మంది ఆదివాసీ మహిళలు ఫిర్యాదు చేసారు.
ఈ వ్యవహారం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. నిరసనలు వెల్లువెత్తాయి. గ్రేహౌండ్స్ పోలీసులు ఎ.రవికుమార్, పి.రవికుమార్, డి. రవికుమార్ బి.రవికుమార్, పూర్ణ చంద్రరావు, పి.పవన్ కుమార్, బి.గంగాధర రావు, డి.వి.ఆర్. సురేష్, ఆర్ శ్రీను, కె.దేవుళ్ళు, టి.ప్రసాద్, కె. రాంబాబు, సీహెచ్. సురేశ్ బాబు, జి. ముత్యాల రాజు, సిహెచ్. విజయకుమార్, ఎస్. తాతబాబు, డి. సింహాచలం, ఎస్. వెంకటరావు, ఆర్. చంద్రశేఖర్, ఆర్. దేవనాధ్, ఎ.ఎస్. శ్రీనివాసరావులపై 2007లో కేసు నమోదుకు ప్రభుత్వం ఆదేశించింది.
వివిధ కారణాలతో కొంత మంది నిందితులను జాబితా నుంచి తొలగించారు. అంతిమంగా 13 మందిపై న్యాయస్థానం విచారణ జరిపింది. కేసు విచారణలో ఎన్నోమలుపులు తిరిగింది. 2018లో జిల్లా ఎస్సీ, ఎస్టీ అత్యాచార (నిరోధక) ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. సుదీర్ఘంగా జరిగిన విచారణలో 38 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఈ కేసును అధికారులు ఎమ్. శివానంద రెడ్డి, బి. ఆనంద రావు దర్యాప్తు చేసారు. కేసు విచారణలో ఉండగా దర్యాప్తు అధికారి బి.ఆనంద రావు మరణించారు.