ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 5, 2020, 9:18 PM IST

ETV Bharat / state

ఏవోబీలో మావోయిస్టుల కదలికలపై పటిష్ఠ నిఘా: ఎస్పీ కృష్ణారావు

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై పటిష్ఠ నిఘా పెట్టామని విశాఖ గ్రామీణ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. గిరిజన గ్రామాలను ఆనుకొని ఉన్న కొండల్లో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతరలు అమర్చినట్లు సమాచారం ఉందని.. ఆయా గ్రామాల ప్రజలు కొద్ది రోజుల వరకు కొండల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

sp press meet on Maoist at aob
ఏవోబీలో మావోయిస్టుల కదలికలపై పటిష్ఠ నిఘా పెట్టాం

విశాఖ జిల్లాలో పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో గిరిజన గ్రామాలను ఆనుకొని ఉన్న కొండల్లో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతరలు అమర్చినట్లు సమాచారం ఉందని గ్రామీణ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోల కదలికలపై నిఘా పెంచామని, నిఘా కోసం స్థానిక‌ అవుట్‌ పోస్టుల వద్ద ఆధునిక డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఆయా గ్రామాల గిరిజనులు కొద్ది రోజులపాటు సమీప కొండల్లోకి వెళ్లొద్దని సూచించారు.

పీఎల్‌జీఏ (పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ) వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆహారం అందుబాటులో ఉండే ప్రాంతాల్లో బాంబులు అమర్చి ఉండొచ్చన్నారు. ఇప్పటికే కూంబింగ్‌ పార్టీలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. పోలీసుల కోసం ఏర్పాటు చేసిన మందుపాతరలకు అమాయకులైన గిరిజనులు బలవుతున్నారని. మావోలు ఇలాంటి దుశ్చర్యలను మానుకోవాలన్నారు.

ముంచంగిపుట్ట, జీకే వీధి, కొయ్యూరు నుంచి ఎక్కువమంది మిలీషియా సభ్యులు లొంగిపోతున్నారన్నారు. అలాంటి వారి కోసం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా రహదారుల విస్తరణ, మరమ్మతులు చేయిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికీ సరిహద్దు గ్రామాల్లో కొందరిని అడ్డుగా పెట్టుకొని మావోలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, ప్రజలు వారికి దూరంగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి:

మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు ఇచ్చి ఆదుకోవాలి: పవన్

ABOUT THE AUTHOR

...view details