విశాఖలో కార్యనిర్వాహక రాజధాని పెట్టే ఆలోచన చేస్తున్నామని సీఎం జగన్ శాసనసభలో వ్యాఖ్య చేసినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయమంతా సాగర నగరం చుట్టూనే తిరుగుతోంది. అదే కనుక నిజమైతే... సచివాలయం సహా ముఖ్య కార్యాలయాలన్నీ అక్కడికే తరలి వెళ్తాయి. తమ పనులు చేయించుకునేందుకు ప్రజలూ అక్కడికే వెళ్లాల్సి వస్తుంది. అయితే రాష్ట్రంలోని 141 నియోజకవర్గాల ప్రజలకు విశాఖ వెళ్లాలంటే దూరాభారం తప్పేలా లేదు.
మండల, జిల్లా స్థాయిల్లో తమ పనులు జరగకపోతే ప్రజలు..వాటిని విభాగాధిపతుల కార్యాలయ సమక్షానికో సచివాలయం దగ్గరకో తీసుకెళ్తారు. అందుకోసం అధికారులు ఉండే చోటుకు వారు వెళ్లక తప్పదు. ఇవే కాక బదిలీలు, పదోన్నతులు, సీఎం సహాయనిధి, పెండింగ్ బిల్లుల మంజూరు వంటి అనేక సమస్యల పరిష్కారానికి సచివాలయమే దర్శనమిస్తుంది. అందుకే సచివాలయం, రాజధాని ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే అంత మేలు. ముందురోజు రాత్రి ఊరి నుంచి బయల్దేరి... తర్వాత రోజు పనులన్నీ పూర్తి చేసుకుని రాత్రి బస్సెక్కి మర్నాడు ఉదయానికి తిరిగి ఊరు చేరుకునేలా ఉంటే సౌకర్యంగా ఉంటుంది. రాష్ట్రంలోని సచివాలయం సహా ఇతర ముఖ్య కార్యాలయాలన్నీ విశాఖకు తరలించాలన్న ప్రతిపాదన కనుక నిజమైతే.... రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల ప్రజలకు దూరాభారమే. రాష్ట్రంలోని 141 నియోజకవర్గాల నుంచి విశాఖకు చేరుకోవాలంటే 300 నుంచి 900 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అది సామాన్యులపై ఆర్థిక భారం మోపినట్టే.
ఉదాహరణకు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఓ వ్యక్తి విశాఖకు వెళ్లాలంటే రైల్లో 21 గంటల పాటు 913 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అంటే రాను, పోను ప్రయాణానికే రెండు రోజుల సమయం వెచ్చించాల్సి వస్తుంది. చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి బస్సులోనైతే 22 గంటలు, రైల్లో అయితే 18 గంటల పాటు విశాఖకు 858 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. కర్నూలు జిల్లా ఆదోని నుంచి విశాఖకు వెళ్లాలంటే సుమారు 20 గంటల పాటు 786 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. కడప నుంచి విశాఖ 730 కిలోమీటర్ల దూరంలో ఉండగా..బస్సులో అయినా, రైల్లో అయినా సుమారు 19 గంటల పాటు ప్రయాణించాల్సిందే.