Visakha Dasapalla Land Irregularities: ఒక ప్లానింగు, ఒక పద్ధతి, ఒక విజన్, అంటూ తెలుగు సినిమాలో నటుడు రావు రమేశ్ చెప్పిన డైలాగ్ ఇది. వైఎస్సార్సీపీ వాళ్లకు ఇది సరిగ్గా నప్పుతుంది. తిరుమలలో పింక్ డైమండ్ అయినా, విశాఖలో దసపల్లా భూములైనా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో జరిగిపోతున్నట్లు భ్రమింపజేస్తారు. అదేంటో మరి అధికారంలోకి రాగానే తూచ్ అని నాలుక కొరక్కుని, వాళ్లే నేరుగా రంగంలోకి దిగుతారు. పక్కా స్కెచ్‌తో సొత్తు కొల్లగొట్టేస్తారు. అన్యాయాలు, అక్రమాల సబ్జెక్టుల్లో జగన్ ముఠాకు నిరభ్యంతరంగా ఇచ్చేయొచ్చు.
వైఎస్సార్సీపీ నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు, విశాఖపట్నం నడిబొడ్డునున్న విలువైన దసపల్లా భూములు ప్రైవేటు పరం అవుతున్నాయని గుండెలుబాదుకున్నారు. సీబీఐతో దర్యాప్తు జరిపించాలని యాగీ చేశారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే సీన్ మారిపోయింది. టీడీఆర్ బాండ్ల కుంభకోణాన్ని దసపల్లా భూముల్లోకీ తీసుకువచ్చారు.
వై. ఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నసమయంలో, విశాఖ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దసపల్లా భూముల్ని తలో వెయ్యి చదరపు గజాల చొప్పున ఇళ్ల స్థలాలుగా పంచుకునేందుకు పథకం పన్నారు. ఆ విషయం బయటకు పొక్కి దుమారం రేగడంతో వెనక్కి తగ్గారు. ఇప్పటి ప్రభుత్వ పెద్దలు ఆ పథకాన్ని మరో మార్గంలో అమలు చేశారు.
దసపల్లా భూముల్లో రహదారి విస్తరణపై హైకోర్టు స్టే - ప్రభుత్వానికి చెంపపెట్టు : మూర్తియాదవ్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని, వ్యవస్థల్ని మేనేజ్ చేసి చేతికి మట్టి అంటకుండా అత్యంత విలువైన భూముల్ని కొట్టేయడంలో వైఎస్సార్సీపీ నేతల తెలివే తెలివి. దానికి దసపల్లా భూముల ఉదంతమే ఉదాహరణ. దసపల్లా సంస్థానానికి చెందిన 15 ఎకరాల భూములు విశాఖ మహానగరం మధ్యలో ఉన్నాయి. వాటిని ఆనుకునే ప్రభుత్వ అతిథిగృహం సర్క్యూట్‌హౌస్, తూర్పు నౌకాదళ ప్రధానాధికారి నివసించే నేవీ హౌస్ ఉన్నాయి.
దసపల్లా భూములపై ప్రభుత్వానికి, దసపల్లా సంస్థాన వారసురాలు రాణి కమలాదేవికి మధ్య ఎప్పటి నుంచో న్యాయవివాదాలు నడుస్తున్నాయి. అక్కడ నాలుగు సర్వే నెంబర్లలోని 60 ఎకరాల భూమిపై ప్రభుత్వం తనకు 1958లో గ్రౌండ్‌రెండ్ పట్టా ఇచ్చిందని రాణి కమలాదేవి చెబుతున్నారు. అందులో ప్రస్తుతం 15 ఎకరాలే మిగిలింది. ఆ భూమిని ఆమె నుంచి పలువురు కొనుగోలు చేశారు. వాటిపై కోర్టుల్లో వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం వాటిని నిషిద్ధ జాబితాలో ఉంచి కాపాడుతోంది.
విశాఖలో దసపల్లా భూముల టీడీఆర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి : జనసేన నేత మూర్తి యాదవ్
ఆ 15 ఎకరాల్లో తమకు వాటా ఉన్నట్టు కమలాదేవి సహా మొత్తం 64 మంది చెబుతున్నారు. దసపల్లా భూములపై ఆమెకు గ్రౌండ్‌రెంట్ పట్టా ఇవ్వడం చెల్లదని 1998లో సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. దానిపై కమలాదేవి హైకోర్టుకి వెళ్లగా ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వం అప్పీల్ చేయడంతో వివాదం సుప్రీం కోర్టుకి చేరింది.
సుప్రీంకు చేరిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన పత్రాలను సకాలంలో అందించకపోడంతో హైకోర్టు తీర్పునే సుప్రీం కోర్టు సమర్థించింది. అయినప్పటికీ అవి ప్రభుత్వ భూములేనని స్పష్టం చేస్తూ, 2015లో అప్పటి కలెక్టర్ వాటిని నిషిద్ధ జాబితాలో కొనసాగించారు. వాటిని ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ రాణి కమలాదేవి 2016లో మళ్లీ హైకోర్టుని ఆశ్రయించారు. అప్పట్నుంచి అది పెండింగ్‌లో ఉంది.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆ భూముల్ని కాపాడేందుకు ప్రభుత్వం తరపున కోర్టులో న్యాయపోరాటం చేయాల్సింది పోయి, వాటిని కొట్టేసేందుకు ప్రణాళిక వేశారు. ఆ భూముల్ని నిషిద్ధ జాబితా నుంచి తొలగించే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో దిశానిర్దేశం చేయాలంటూ, 2021 ఆగస్టులో భూ పరిపాలన ప్రధాన కమిషర్‌కు విశాఖ కలెక్టర్‌తో లేఖ రాయించారు.
ప్రపంచంలోనే నూతన ఒప్పందం: మరోపక్క వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సన్నిహితులుగా ప్రచారంలో ఉన్న వ్యక్తులు ఏర్పాటు చేసిన అష్యూర్ డెవలపర్స్ అనే సంస్థ, దసపల్లా భూముల యజమానులుగా చలామణి అవుతున్న 64 మందితో 2021 జూన్, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో డెవలప్‌మెంట్ ఒప్పందం చేసుకుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భూ యజమానులకు కేవలం 29 శాతం, డెవలపర్లకు 71 శాతం వాటా చొప్పున ఒప్పందం జరిగింది.
నిషిద్ధ జాబితాలో ఉండగానే దసపల్లా భూముల్లో పనులు.. చోద్యం చూస్తున్న అధికారులు
దసపల్లా భూములపై అడ్వకేట్ జనరల్‌ను, న్యాయ విభాగాన్నీ సంప్రదించామని 2009లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఆ భూములపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు సూచిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ సీసీఎల్ఏ జి. సాయిప్రసాద్ 2022 సెప్టెంబరులో మెమో జారీ చేశారు. అప్పటికే దసపల్లా భూములపై తీవ్ర దుమారం కావడం, వాటిని నిషిద్ధ జాబితా నుంచి తొలగిస్తే మరింత వివాదమవుతుందున్న ఉద్దేశంతో సర్కారు ఇంకో ఎత్తుగడ వేసింది.