ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Swetha Case: వీడిన శ్వేత కేసు మిస్టరీ.. కారణం ఏంటంటే..!

Vizag swetha case: రాష్ట్రంలో సంచలనంగా మారిన వివాహిత శ్వేత కేసు మిస్టరీ వీడింది. అయితే శ్వేత మృతిని ఆత్మహత్యగా భావించినప్పటికీ.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లి ఫిర్యాదుతో అందరిపై కేసు నమోదు చేశామన్న సీపీ.. కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు.

Vizag swetha case
Vizag swetha case

By

Published : Apr 28, 2023, 9:02 PM IST

విశాఖ శ్వేత మృతిపై వీడిన మిస్టరీ.. సీపీ ఏమన్నారంటే..!

Vizag swetha case: విశాఖ ఆర్కే బీచ్‌లో మంగళవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన వివాహిత శ్వేత (24) కేసులో మిస్టరీ వీడింది. శ్వేత మృతిని ఆత్మహత్యగా భావించినప్పటికీ.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. శ్వేత ఇంటి నుంచి బయటకు వచ్చిన దగ్గరి నుంచి.. ఆర్కే బీచ్‌లో శవమై కనిపించినప్పటి వరకూ చోటు చేసుకున్న పరిణామాలను విశాఖ సీపీ త్రివిక్రమ్‌ వర్మ మీడియాకు వివరించారు.

శ్రీకాకుళం జిల్లా మూలపేటకు చెందిన శ్వేతకు ఏడాది క్రితం గాజువాక సమీపంలోని ఉక్కు నిర్వాసితకాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గురుమిల్ల మణికంఠతో వివాహం అయింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. పదిహేను రోజుల క్రితం కార్యాలయ పనిపై మణికంఠ హైదరాబాద్‌ వెళ్లారు. అత్తామామలతో కలిసి ఉంటున్న శ్వేత మంగళవారం సాయంత్రం అత్తతో గొడవ జరిగింది. ఆ తర్వాత రాత్రి 8.20 నుంచి 8.32 వరకు భర్తతో భర్తతో ఫోన్‌లో మాట్లాడింది. అనంతరం సూసైడ్‌ నోట్‌ను గదిలో పెట్టి ఇంటి నుంచి వెళ్లి పోయింది. శ్వేత పేరుపై కోటబొమ్మాళిలో ఉన్న 90 సెంట్ల భూమి.. తన పేరుపై రాయాలని భర్త మణికంఠ ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తున్నాడు.

తల్లి ఎదుటే శ్వేతపై దాడి..శ్వేత గర్భవతి అయిన తర్వాత పుట్టింటికి వెళ్లినప్పుడు ఆమె తల్లి ఎదుటే భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. తన తల్లి ఎదుటే మణికంఠ శ్వేతపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. అప్పుడే ఆత్మహత్యకు ప్రయత్నించగా తల్లి కాపాడింది. అప్పటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. శ్వేత ఆడపడుచులిద్దరూ వారి ఇంటికి సమీపంలోనే ఉంటారు. వారు తరచూ ఇంటికి వచ్చి భర్త లేని సమయంలో శ్వేతను వేధిస్తుండే వారు. ఇటీవల జరిగిన పరిణామాలు, సూసైడ్‌ నోట్‌ ఆధారంగా శ్వేతది ఆత్మహత్యేనని భావిస్తున్నాం. శ్వేత శరీరంపై కూడా ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైందని సీపీ వెల్లడించారు.

సూసైడ్‌ నోట్‌ గుర్తించాం:‘నాకు ఎప్పుడో తెలుసు.. నేను లేకుండా నువ్వు బిందాస్‌గా ఉండగలవని. నీకు అసలు ఏమాత్రం బాధ ఉండదని. ఏదేమైనా ఆల్‌ ది బెస్ట్‌ ఫర్‌ యువర్‌ ఫ్యూచర్‌.. న్యూ లైఫ్‌. చాలా మాట్లాడటానికి ఉన్నా కూడా.. నేను ఏమీ మాట్లాడడం లేదు. యూ నో ఎవ్రీథింగ్‌. జస్ట్‌ క్వశ్చన్‌ యువర్‌ సెల్ఫ్‌’ అంటూ శ్వేత సూసైడ్‌ లేఖలో రాసి ఉంది. ‘ఏ బిగ్‌ థ్యాంక్స్‌ ఫర్‌ ఎవ్రీథింగ్‌’ అంటూ స్మైలీ బొమ్మ వేసిన ఆ లేఖను శ్వేత గదిలో గుర్తించామని సీపీ తెలిపారు. లేఖలో దస్తూరి శ్వేతదేనని ఆమె తల్లి కూడా నిర్ధారించారని వెల్లడించారు.

మృతదేహం పడి ఉన్న తీరుపై అనుమానాలు..బీచ్‌లో శ్వేత మృతదేహం ఇసుకలో కూరుకుపోయి ఉండటం, ఒంటిపై లోదుస్తులు మాత్రమే ఉండటంపై పలు అనుమానాలు తలెత్తాయి. ఈ ప్రశ్నలపై సీపీ త్రివిక్రమ్‌ స్పందించారు. సముద్రం ఆటుపోట్ల కారణంగానే మృతదేహం ఆ ప్రాంతానికి కొట్టుకొచ్చిందని వెల్లడించారు. గతంలో కూడా రెండు మృతదేహాలు అదే ప్రాంతానికి కొట్టుకొచ్చాయని వెల్లడించారు. ఈ అంశంపై పర్యావరణ నిపుణులతో చర్చించిన తర్వాత, ఘటనా స్థలిలో లభ్యమైన ఆధారాలను బట్టి ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పారు. చెప్పులు వదిలి వెళ్లిన ప్రాంతానికి 150 మీటర్ల దూరంలో మృతదేహం లభ్యమైందన్నారు. శ్వేత శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో కూడా తేలిందన్నారు. శ్వేత తల్లి ఫిర్యాదు మేరకు అత్తమామలు, భర్త, ఆడపడుచు భర్తపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా సాక్ష్యాధారాలు సేకరించామని సీపీ వివరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details