Kidney Racket Investigation: కలకలం సృష్టించిన విశాఖ కిడ్నీ రాకెట్ కేసును పోలీసులు ఛేదించారు. డాక్టర్ పరమేశ్వరరావు సహా మరో ఐదుగురు దళారుల్ని అరెస్టు చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులు, కుటుంబాలే లక్ష్యంగా ఈ ముఠా దందాకు తెర లేపినట్లు గుర్తించారు. కీలక సూత్రధారి నార్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్వాన తిరుమల ఆస్పత్రిలో కిడ్నీ ఆపరేషన్లు జరిగినట్లు తేల్చారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులు, కుటుంబాలపై కన్నేస్తారు. కిడ్నీ ఇస్తే లక్షల్లో డబ్బు చెల్లిస్తామని ఆశ చూపుతారు. భయపెట్టో, బలహీనతను ఆసరాగా చేసుకునో... లేదంటే బలవంతంగానైనా కిడ్నీలు తీసుకుంటారు. ఇటీవల విశాఖలో సంచలనంగా మారిన కిడ్నీ రాకెట్ వెనుకున్న ముఠా దందా సాగిన తీరిది. ఈ కేసులో డాక్టర్ పరమేశ్వరరావుతోపాటు దళారులు కామరాజు, శ్రీను, శేఖర్, ఎలీనా, కొండమ్మను అరెస్ట్ చేసినట్లు... విశాఖ నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ తెలిపారు.
తిరుమల ఆసుపత్రిలో వినయ్ కుమార్, వాసుపల్లి శ్రీనివాస్‌రావుకు ఆపరేషన్ జరిగిందన్న పోలీసులు.... నిందితులపై 307, 326, 420తో పాటు అనధికారిక తొలగింపు చట్టం నిబంధనల ఉల్లంఘన కింద కేసులు పెట్టామన్నారు. ఈ కేసులో కీలక సూత్రధారి నార్ల వెంకటేశ్వరరావు గతంలోనూ కిడ్నీ రాకెట్ కేసులో జైలుకు వెళ్లాడని వెల్లడించారు.