విశాఖ నగర శివారు కొమ్మాదిలోని రూ.100 కోట్ల భూ వివాదం మరో మలుపు తిరిగింది. ఈ భూముల వివరాలు అధికారిక ‘వెబ్‌ల్యాండ్’లో ఉంచే క్రమంలో నిబంధనలు పాటించలేదని పేర్కొంటూ చినగదిలి (విశాఖ రూరల్) మండల తహసిల్దార్ ఆర్.నర్సింహమూర్తిని కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున సస్పెండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వెంటనే ఇన్‌ఛార్జి తహసిల్దార్‌గా అదే కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేస్తున్న కిరణ్‌కుమార్‌ను నియమించారు.
కొమ్మాది భూములు రిజిస్ట్రేషన్ కాకుండా వ్యవహరించారనే కారణంతోనే తహసిల్దార్‌పై ఈ తరహాలో చర్యలు సాగినట్లు రెవెన్యూ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఆది నుంచి అసలైన భూ యజమానులకు అనుకూలంగా ఎంఆర్వో కార్యాలయం ఉత్తర్వులు ఇస్తూ వచ్చింది. రిజిస్ట్రేషన్ జరుగుతున్న సమయంలోనూ ఆన్‌లైన్‌లోని భూ వివరాలను బ్లాక్ చేసి...రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులకు సమాచారం తెలిపి అప్రమత్తం చేసింది. ఫలితంగానే ఈే కసులో అక్రమార్కులు ఎవరో గుర్తించగలిగారు. భూములు ఇతరుల పరం కాకుండా చేయగలిగారు. ఇదే విషయాన్ని భూ యజమానులు సైతం వివరిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో విధాన పరమైన తప్పిదాలు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ తహసిల్దార్‌ను సస్పెండ్ చేశారు.
అసలు ఏం జరిగిందంటే:
చిన గదిలి మండల కార్యాలయ పరిధిలోని కొమ్మాదిలో సర్వే సంఖ్య 54/1 నుంచి 54/6 వరకు, 53/1, 53/3, 53/4ల్లో 12.26 ఎకరాల భూమి ఉంది. ఇవి అమెరికాలో ఉన్న తుమ్మల కృష్ణ చౌదరికి చెందినవి. ఇతని వద్ద జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) తీసుకున్నామని నమ్మించిన కొందరు ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు కుమారుడు సుకుమార్‌వర్మకు విక్రయించే ప్రయత్నాలు జరిగాయి. ఈ తతంగం జరుగుతున్న విషయం తెలిసి...కృష్ణ చౌదరి కుటుంబ సభ్యులు తహసిల్దార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అమెరికాలో ఉన్న కృష్ణచౌదరితో వీడియోకాల్ ద్వారా మాట్లాడిన తహసీల్దార్ వన్‌బీలో ఆయన పేరుతో ఉన్న ఆన్‌లైన్‌లో భూముల వివరాలను ఎరుపు రంగుతో బ్లాక్ చేయించారు.
వన్‌బీలో ఎరుపు రంగు ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికి వీలుపడదు. అప్పటికే ఆ భూముల రిజిస్ట్రేషన్‌కు అంతా సిద్ధం చేసుకున్న ఎమ్మెల్యే కన్నబాబురాజు కుటుంబీకులు విషయం తెలిసి...తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. వన్‌బీలోని సర్వే నంబర్లను ఎందుకు బ్లాక్ చేశారంటూ అడిగినట్లు కార్యాలయ వర్గాల సమాచారం. అయితే బ్లాక్ చేసిన సర్వే నంబర్లను మళ్లీ గంటల వ్యవధిలోనే రెవెన్యూ అధికారులు ఆ పరిధి నుంచి తొలగించి సాధారణ స్థితిలో ఉంచారు. ఇందుకోసం అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చిందనే చర్చ సాగుతోంది. ఇలా వెంటవెంటనే చేసిన మార్పులే తహసిల్దార్ మెడకు చుట్టుకున్నట్లు తెలుస్తోంది.