Simhadri Appanna Chandanotsavam: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం ఈ నెల 23న జరగనుంది. ఈ నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలపై బుధవారం జిల్లా అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయి పరిశీలన జరిపింది. విశాఖ జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ విశ్వనాధ్, డీసీపీలు సునీల్ సుమిత్. ఆనంద్ రెడ్డి.. ఇతర పోలీసు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు సింహాచలం ఈవో వి త్రినాధరావు తో కలిసి చందనోత్సవ ఏర్పాట్లను పలు ప్రాంతాల్లో పరిశీలించారు.
తొలుత వీరంతా కళ్యాణ వేదిక వద్దకు చేరుకొని క్యూలైన్ల మార్గాలు, భక్తులు వాహనాలు పార్కింగ్ ఇతర సదుపాయాలు కోసం ఉత్సవ మాస్టర్ ప్లాన్ను పరిశీలించారు. ఆలయ అధికారులు, పూజారులను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. ఉచిత దర్శనంతో పాటుగా... 300, 1000, 1500 క్యూ లైన్లు ఏ విధంగా వేగంగా ముందుకు సాగుతాయని ఈఓ త్రినాధ్ రావును, ఈఈ ని అడిగి తెలుసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు వీరికి వివిధ క్యూలైన్లు చూపించారు. గత ఏడాది ఏర్పాటుచేసిన క్యూలైన్లకు ఈ ఏడాది ఏర్పాటుచేసిన వాటికి వ్యత్యాసం కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్లు వేగవంతంగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని దేవస్ధానం అధికారులుకు కలెక్టర్ సూచించారు. భక్తులు ఎక్కువసేపు వేచి చూడకుండా వేగవంతంగా సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా చూడాలని కోరారు. అనంతరం ఆలయ ప్రాంగణం తో పాటు వివిధ మార్గాల రూట్లను పరిశీలించారు.