త్వరలో హరిద్వార్ వేదికగా ప్రారంభం కానున్న కుంభమేళాలో విశాఖ శ్రీ శారదాపీఠం సేవలను అందించనుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి హరిద్వార్ వెళ్లే భక్తుల కోసం విశేష సేవలను అందించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ విషయమై ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓంప్రకాష్ తో ఉత్తర పీఠాధిపతులు స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి చర్చించారు. ఈ మేరకు సోమవారం అక్కడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని డెహ్రాడూన్ లో కలిసారు.
విశాఖ శ్రీ శారదాపీఠం తరపున భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించదలచినట్టు సీఎస్‌కు వివరించారు. సేవా కార్యక్రమాలపై విశాఖ శ్రీ శారదాపీఠంతో సమన్వయం చేసుకోవాలని మేళా అధికారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. విశాఖ శ్రీ శారదాపీఠంతో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఎంతో అనుబంధముందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓంప్రకాష్ అన్నారు.