ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైరాలజీ ల్యాబ్‌.. 6వేల పరీక్షల దిశగా.. - విశాఖ జిల్లా తాజా వార్తలు

పది నెలల క్రితం కేజీహెచ్‌లో ఏర్పాటు చేసిన వైరాలజీ డయోగ్నోస్టిక్‌ ల్యాబొరేటరీ (విఆర్‌డిఎల్‌)ను విస్తరించారు. ప్రస్తుతం ఉన్న పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆంధ్ర వైద్యకళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీవీ.సుధాకర్‌ తెలిపారు. విస్తరణ నేపథ్యంలో సమకూరిన వసతులు, కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య పరికరాలు, తదితర అంశాలను ఆయన ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Virology Lab‌ .. Towards 6 thousand tests
వైరాలజీ ల్యాబ్‌.. 6వేల పరీక్షల దిశగా..

By

Published : Jan 25, 2021, 5:03 PM IST

పది నెలల క్రితం కేజీహెచ్‌లో ఏర్పాటు చేసిన వైరాలజీ డయోగ్నోస్టిక్‌ ల్యాబొరేటరీ (విఆర్‌డిఎల్‌)ను విస్తరించారు. ప్రస్తుతం ఉన్న పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆంధ్ర వైద్యకళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ తెలిపారు. విస్తరణ నేపథ్యంలో సమకూరిన వసతులు, కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య పరికరాలు, తదితర అంశాలను ఆయన తెలిపారు.

ప్రస్తుతం కేజీహెచ్‌ వైరాలజీ ల్యాబ్‌లో అయిదు ఆర్టీపీసీఆర్‌ యంత్రాలు, మూడు బయో క్యాబిన్లు, మూడు ఆర్‌ఎన్‌ఏ ఎక్స్‌ట్రాక్షన్లు ఉన్నాయి. శాస్త్రవేత్తలు, టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కలిపి 40 మంది సేవలు అందిస్తున్నారు. అందుబాటులో ఉన్న వైద్య పరికరాలతో రోజుకు 3600 వరకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ర్యాపిట్‌ టెస్ట్‌ కిట్లతో కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు నిలిపివేయడంతో వైరాలజీ ల్యాబ్‌పై అదనపు భారం పడింది. దీంతో పరీక్షల సంఖ్యను 6వేలకు పెంచాలని ప్రతిపాదించారు.

పరీక్షల సంఖ్య పెంచుతున్నందున రూ.కోటి విలువ చేసే మూడు ఆర్టీపీసీఆర్‌ యంత్రాలు, రెండేసి చొప్పున బయోసేఫ్టీ క్యాబిన్లు, ఆర్‌ఎన్‌ఏ ఎక్స్‌ట్రాక్షన్‌ పరికరాలను ఆరోగ్య శాఖ అధికారులు తాజాగా సమకూర్చారని ప్రిన్సిపల్‌ తెలిపారు. కొత్త పరికరాలను వినియోగంలోకి తెస్తున్నామని చెప్పారు. వీటి సహాయంతో ఇక నుంచి 6వేల పరీక్షలు చేసే సామర్థ్యానికి ల్యాబ్‌ చేరుతుందన్నారు.

ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు: కొవిడ్‌ నిర్ధరణ పరీక్షల సంఖ్య పెరుగుతున్నందున అదనంగా ఇద్దరు పరిశోధన శాస్త్రవేత్తలు, నలుగురు సహాయకులు, 12 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 9 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులు.. మొత్తం 25 ఉద్యోగాలను ప్రభుత్వం మంజూరు చేసిందని ప్రిన్సిపల్‌ చెప్పారు. ఆయా నియామకాలను ఒప్పంద ప్రాతిపదికన చేపడతామన్నారు. తాజాగా మంజూరైన 25 పోస్టులను భర్తీ చేసేందుకు జేసీ అరుణ్‌బాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పి.ఎస్‌.సూర్యనారాయణ, తనతో కలిసి కలెక్టర్‌ కమిటీ ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేసి అర్హులైన వారితో రెండు వారాల్లో పోస్టులను భర్తీ చేస్తామన్నారు. 8 పరికరాలతో 24గంటలూ చేయడం వల్ల నిర్దేశిత లక్ష్యం ప్రకారం రోజుకు ఆరువేల పరీక్షలు చేయవచ్చునని ప్రిన్సిపల్‌ వివరించారు.

ఇదీ చదవండి: వాయిస్ మెసేజ్ పెట్టి.. ఆత్మహత్య చేసుకున్నాడు!

ABOUT THE AUTHOR

...view details