విశాఖ నగరంలో కీలక ప్రాంతం గాజువాక. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీనితో ప్రజలంతా పెద్ద గంట్యాడ, గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆశ్రయించారు. రోగులకు వైద్యులు డెంగీ, మలేరియా పరీక్షలు చేసి ఫలితాలు వెను వెంటనే ఇస్తున్నారు. విపరీతమైన దోమలు, అపరిశుభ్రమైన వాతావరణం వల్ల జ్వరాలు పెరిగాయని స్థానికులు చెప్తున్నారు.
జ్వరాల కేసులు ఎక్కువ వస్తున్నట్టు పెద్దగంట్యాడ వైద్యులు అంటున్నారు. దీనికోసం పెద్ద గంట్యాడ, గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు సిద్ధం చేశారు. రోజు ఫాగింగ్ చేయటం, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమలు, లార్వా పెరగకుండా చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దోమల నివారణ చర్యలు ఇంకా పెంచాలని గాజవాక వాసులు కోరుతున్నారు.