ఆర్థిక రాజధాని పేరిట విశాఖలో అరాచకాలు సృష్టిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ ఆక్షేపించారు. తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖలో కబ్జా చేసిన భూములను కాపాడుకునేందుకే ఆర్థిక రాజధాని పేరిట డ్రామాకు తెరలేపారని అన్నారు. తెలుగుదేశం హయాంలో విశాఖ ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా రూపుదిద్దుకుందని వాసుపల్లి చెప్పారు.
ఎన్నికల ముందు మూడు రాజధానులపై వైకాపా ఎందుకు ప్రకటన చేయలేదని ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక అనాలోచిత నిర్ణయాలతో అమరావతికి మరణ శాసనం రాస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే హక్కు వైకాపా ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. ప్రజా రాజధానిగా అమరావతి ఉంటేనే 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అమరావతితోనే సాధ్యమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.