విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)ను.. లాక్ డౌన్ తర్వాత సాధారణ ఆసుపత్రిగా కొనసాగించాలని విశాఖ వాసులు కోరుకుంటున్నారు. విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి తర్వాత సామాన్య ప్రజానికానికి విమ్స్ పెద్దదిక్కుగా నిలుస్తోంది. ఇప్పుడీ ఆస్పత్రిని కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రిగా ప్రకటించిన కారణంగా.. అవుట్ పేషెంట్ సేవలు నిలిచిపోయాయి. ఈ నేపధ్యంలో పలు ప్రాంతాల ప్రజలకు సాధారణ చికిత్సలు నిలిచిపోయాయి.
ప్రైవేటు వైద్యులు కూడా అందుబాటులో లేని కారణంగా... నగర శివార్లలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలోని మందుల దుకాణం కూడా మూసి వేసిన కారణంగా కనీసం మందులు, ఇంజక్షన్లు దొరకటం కష్టతరమైందని స్థానికులు వాపోతున్నారు. లాక్ డౌన్ ఆంక్షల్లో సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించి కింగ్ జార్జి ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు.