Digital campaign of MLC election in Uttarandhra: ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పోలింగ్ సమయం ముగియనుండడంతో డిజిటల్ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో అందరి చూపు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపైనే ఉంది. అందుక్కారణం ఈసారి 37మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో భారీ ఉత్కంఠ నెలకొంది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. 37మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ.. ప్రధానంగా నలుగురి మధ్యే తీవ్రమైన పోటీ నెలకొందని తెలుస్తోంది. ఆ నలుగురు ఎవరెవరంటే?.. వైసీపీ తరుపు అభ్యర్థి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్, టీడీపీ తరుపు అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు, బీజేపీ తరుపు అభ్యర్థి మాధవ్‌తో పాటు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అభ్యర్థి కోరెడ్ల రమాప్రభల మధ్య పోటీ ఉండనుందని ఉత్తరాంధ్ర ఓటర్లు చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటూ అధికార, ఇటూ విపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు ఎన్నికలకు సంబంధించి అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలతో పాటు.. బ్యాలెట్ పెట్టెలు, సామాగ్రిని సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఇంటింటా ప్రచారం పూర్తి చేసుకున్న అభ్యర్థులు.. ఇప్పుడు డిజిటల్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఓటర్లుగా నమోదు చేసుకున్న వారి జాబితా ఆధారంగా చరవాణిలో సందేశాలు, వాట్సాప్ గ్రూపులు పెట్టి.. ఆ గ్రూపులలో దృశ్య ప్రచారాన్ని ప్రారంభించారు. ఓటర్లు తమను గెలిపిస్తే ఏయే కార్యక్రమాలను చేయనున్నారో ఆ సందేశాలను ఆ గ్రూపులలో పంపుతున్నారు.
ఇక, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం అన్ని పార్టీలలోని సీనియర్ నాయకులు రంగప్రవేశం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కేంద్రాలలో బస చేసి ప్రచారానికి ఊపు తెస్తున్నారు. వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి సైతం విశాఖలో బస చేసి.. వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. వారి వెంట మంత్రులు ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, పిడిక రాజన్న దొర తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారు.