స్వాతంత్య్ర సమరయోధుల త్యాగస్ఫూర్తిని అందిపుచ్చుకొని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు యువతకు పిలుపునిచ్చారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా అల్లూరి సీతారామరాజు జన్మస్థలమైన విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఇదే మండలం బర్లపేటలో స్వాతంత్య్ర సమరయోధులు రూపాకుల సుబ్రహ్మణ్యం, విశాలాక్షి విగ్రహాలను మిజోరం గవర్నర్ హరిబాబుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా దేశవ్యాప్తంగా స్వరాజ్య సాధకుల జన్మస్థలాలు, వారి పేరుతో ఏర్పాటు చేసిన స్మృతి చిహ్నాలు, ఉద్యమాలు సాగించిన చారిత్రక ప్రదేశాలను సందర్శించడం ద్వారా అమితమైన ప్రేరణ కలుగుతుందన్నారు. నా వంతు బాధ్యతగా కొందరు సమరయోధులకు సంబంధించిన వివరాలను సేకరించి వారు ఏ విధమైన త్యాగాలు చేశారు, వారి పోరాట పటిమ వంటి అంశాలను కథనాలుగా రాస్తున్నానని...’ వెల్లడించారు. రూపాకుల సుబ్రహ్మణ్యం, విశాలాక్షి దంపతులు స్వాతంత్య్ర సంగ్రామంలో వివిధ ఉద్యమాల్లో పాల్గొని చూపించిన తెగువ ప్రశంసనీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తొలుత పాండ్రంగిలో అల్లూరి సీతారామరాజు జన్మించిన ఇంటిని సందర్శించారు. ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. అల్లూరి, రూపాకుల కుటుంబీకులను జ్ఞాపికలతో సత్కరించారు. ఎమ్మెల్సీ మాధవ్, మాజీ మంత్రి నరసింహరాజు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. సీఎం జగన్ కూడా నగరానికి రావడంతో అక్కడికి వెళ్లారని పార్టీ నేతలు చెబుతున్నారు.
‘ప్రేమసమాజం’ భారతీయ సంస్కృతిని అందిపుచ్చుకుంది