ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ.. వెంకటాపురం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. అక్కడున్న విషవాయువు వారి జీవితాల్లో చీకటిని నింపింది. దాని ప్రభావంతో వారు .. ప్రభుత్వం ఏర్పాటుచేసిన శిబిరాల్లో తలదాచుకున్నారు. అక్కడినుంచి ఇంటికివెళ్లిన ఆ వాయువు ప్రభావం మాత్రం పోలేదు. వారు ఇంకా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు. ఎంత శుభ్రం చేసినా ఇంకా వాయువు ఇళ్లలో ఉండిపోయింది. వాసన వల్ల ఇళ్లలో ఉండలేక పోతున్నారని బాధ పడుతున్నారు. ఫ్యాక్టరీ ప్రహరీ అనుకుని ఉన్న వెంకటపురంపై ఎక్కువ వాయువు ప్రభావం పడిందని గర్భిణులు, వృద్దులు ఆవేదన చెందుతున్నారు. ఇంకా కళ్లలో మంటలు తగ్గలేదని...వాపోతున్నారు.
'వెంకటాపురానికే ఎక్కువ నష్టం జరిగింది'
ఎల్జీ పాలిమర్స్ ఆ గ్రామంలో విషాదాన్నే మిగిల్చింది. అప్పుడు జరిగిన సంఘటనా ఆనవాళ్లు ఇప్పటికే ప్రజలపై ప్రభావం చూపుతూనే ఉన్నాయి. వెంకటాపురంలో వైద్య పరీక్షలు జరగక పోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంత శుభ్రం చేసినా వాయువు ఇంట్లోనే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగతా గ్రామాలలా కాకుండా వెంకటాపురానికే ఎక్కువ నష్టం జరిగింది కనుక... మొదటి ప్రాధాన్యతనిచ్చి తమను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వెంకటాపురం ప్రజల సమస్యలు
చాలా మంది తమ నిత్యావసర సామగ్రి మొత్తం పడేశారు. ఇప్పుడు ప్రభుత్వం, పరిశ్రమ పెట్టె ఆహారంపై ఆధారపడి ఉన్నారు. ఎన్ని రోజులకు తిరిగి మాములు రోజులు వస్తాయో తెలియడం లేదని బాధపడుతున్నారు. బాధిత గ్రామాలలో శాశ్వత ఆసుపత్రి కట్టాలని డిమాండ్ వారు చేస్తున్నారు. మెరుగైన వైద్యాన్ని అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీచూడండి.ఏటీఎంలో నగదు చోరీకి దుండగుల యత్నం