గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాల మధ్య రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విశాఖ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు రాయవరం మండలం సోముదేవుపల్లి వద్ద వరాహ గట్టు కొతకు గురైంది. భారీ వర్షాలకు ఎగువనుంచి వస్తున్న వరదతో నది ఉగ్ర రూపం దాల్చింది. గతేడాది ఇలాంటి సమయంలో గట్టు చాలా వరకు కొట్టుకుపోయింది. పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు చొరవ తీసుకుని అధికారులతో మాట్లాడి గట్టు వేయించారు. అది ప్రస్తుత వర్షాలతో మళ్లీ అదే పరిస్థితికి చేరింది.