Vangalapudi Anitha complained to Cyber Crime : వైఎస్సార్సీపీలో ఉంటేనే ఆడవాళ్లు, మిగతా పార్టీలో ఉంటే కాదా అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. తన వీడియోను తప్పుగా ఎడిటింగ్ చేసి ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోరని ఆమె నిలదీశారు. పోలీసులు కనీసం ఫిర్యాదు తీసుకునేందుకూ భయపడుతున్నారని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖలో సైబర్ క్రైమ్ పోలీసులకు వంగలపూడి అనిత ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు తిరస్కరించిన సైబర్ క్రైమ్ : ఓ సమావేశంలో తాను ఒక విధంగా మాట్లాడితే దానిని తమకు అనుకూలంగా మార్చుకొని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అనిత ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పోలీసులు ఇలాంటి కేసులు సైబర్ క్రైమ్‌లో తీసుకోవడం కుదరదని చెప్పడంతో అనిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ అన్యాయాలను సమర్థిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన కార్యకర్తలు ఎవరైనా సోషల్ మీడియా వేదికగా చిన్న చిన్న మెసెజ్‌లు పెట్టినా వారిని స్టేషన్ పిలిపించి రెండు మూడు రోజులు స్టేషన్లోనే ఉంచిన పోలీసులకు తాను పెట్టిన కేసును తీసుకోవడం కుదరదని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఇటువంటి విషయాలు తమ పరిధిలోకి రావని సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.
ఫోర్జరీ సంతకంతో ఓ నకిలీ లేఖ :మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తన ప్రసంగాన్ని వక్రీకరించిన వారికి తగిన బుద్ధి చెబుతానని, నిజాలు తెలుసుకోకుండా సాక్షి టీవీలో వీడియో ప్రసారం చేసినందుకు ఫిర్యాదు చేస్తానని వంగలపూడి అనిత చెప్పారు. గురువారం మధ్యాహ్నం విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అనిత మాట్లాడుతూ తన ప్రాణం ఉన్నంత వరకు జగన్ సీఎం అవుతారనే మాటను అననని అన్నారు. ప్రదీప్ అనే అతను తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో వీడియో పెట్టినట్లుగా తెలిసిందని, అతని వెనుక వైఎస్సార్సీపీ నేతల హస్తం ఉందని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తనకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఫోర్జరీ సంతకంతో ఓ నకిలీ లేఖను విడుదల చేశారని ఆమె అన్నారు.