Vande Bharat express stations : తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా అందిస్తున్న ఈ రైలును దిల్లీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రారంభం రోజు వందే భారత్ రైలు ప్రత్యేక వేళల్లో నడవనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఆదివారం ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన వందే భారత్ రైలు చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు. అదే రోజు రాత్రి 8.45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రుల కోసం..హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్రకు జిల్లాలకు వెళ్లాలంటే.. రైళ్లలో ఎప్పుడూ బెర్తులు దొరకని పరిస్థితి ఉంటుంది. 4 నెలల ముందు బెర్తుల రిజర్వేషన్ ప్రారంభమైనా కొద్ది రోజులకే రైళ్లు నిండిపోతుంటాయి. రోజూ ప్రయాణించే 9 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తోడు.. వారంలో 1, 2, 3 రోజులు నడిచే ప్రత్యేక రైళ్లున్నా, అన్నింటిలోనూ నిరీక్షణ జాబితా చాంతాడంత కన్పిస్తుంటుంది. ఈ తరుణంలో వందే భారత్ ఎక్సప్రెస్ రావడాన్ని నగర ప్రయాణికులు స్వాగతిస్తున్నారు.