ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశ్వ 'వివాదాల'యాలు.. వీసీల రాజకీయాలతో మసకబారుతున్న వర్సిటీల ప్రతిష్ఠ!

Universities In Ap: రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు రాజకీయ కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయి. నియామకాలు, పదోన్నతుల్లో నిబంధనల ఉల్లంఘన.. కొందరు ఉపకులపతుల వ్యవహార శైలి, వివాదాస్పద నిర్ణయాలతో వర్సిటీల ప్రతిష్ఠ మసకబారుతోంది. మరోవైపు సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, అధ్యాపకుల కొరత కారణంగా అంతర్జాతీయ ర్యాంకుల్లో ముందడుగు పడటం లేదు.

universities-in-andhrapradesh
universities-in-andhrapradesh

By

Published : Jul 24, 2022, 4:07 AM IST

Universities In Ap: చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా వర్ధిల్లాల్సిన రాష్ట్ర విశ్వవిద్యాలయాలు రాజకీయ కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయి. నియామకాలు, పదోన్నతుల్లో నిబంధనల ఉల్లంఘన.. కొందరు ఉపకులపతుల వ్యవహార శైలి, వివాదాస్పద నిర్ణయాలతో వర్సిటీల ప్రతిష్ఠ మసకబారుతోంది. మరోవైపు సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, అధ్యాపకుల కొరత కారణంగా అంతర్జాతీయ ర్యాంకుల్లో ముందడుగు పడటం లేదు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి వర్సిటీని రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారనే ఆరోపణలున్నాయి. ఆయన వీసీ విధుల కంటే రాజకీయ కార్యకలాపాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారనే విమర్శలున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. దీంతో పలువురు నాయకులు వీసీని కలిసేందుకు తరచూ వర్సిటీకి రావడంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో తన ఛాంబర్లో సీఎం జన్మదిన వేడుకలను నిర్వహించడం లాంటి ఘటనలపై తీవ్ర విమర్శలొచ్చాయి. ఇటీవల తాడేపల్లిలో ఎంపీ విజయసాయిరెడ్డిని వీసీ ప్రసాదరెడ్డి కలిసిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తనను కలిశారంటూ ఎంపీ ట్వీట్‌ చేసి ఆ తర్వాత దానిని తొలగించారు. ఈ ట్వీట్‌లో పెట్టిన ఫొటోలో ఎంపీకి వీసీ ప్రసాదరెడ్డి పుష్పగుచ్ఛం ఇస్తూ కనిపించారు. ఏయూ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల, ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ (ఐ.ఎ.ఎస్‌.ఇ)లకు ప్రిన్సిపాళ్లుగా ఉద్యోగ విరమణ చేసిన వారిని నియమించారు. రోస్టర్‌ రిజర్వేషన్‌ పాటించకుండా కొంతమందిని తాత్కాలిక ఉద్యోగులుగా నియమించారు.

  • విక్రమ సింహపురి వర్సిటీలోనూ నాయకుల పుట్టిన రోజులు జరిగాయి. గతంలో ఇక్కడ రిజిస్ట్రార్‌గా పని చేసిన ఓ ఆచార్యుడు తన గదిలో ఓ రాజకీయనాయకుడి ఫొటోను పెట్టుకోవడంపై విమర్శలు వచ్చాయి.
  • చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా.. వైకాపా సభలో మంత్రి పెద్దిరెడ్డిని కలవడం అప్పట్లో వివాదాస్పమైంది. ఈ విషయమై రిజిస్ట్రార్‌ స్పందిస్తూ.. వర్సిటీలోని సమస్యలను విన్నవించేందుకే అక్కడకు వెళ్లానని అప్పట్లో వివరణ ఇచ్చారు. దీనిపై ఎస్‌ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి.

నియామకాలపై దుమారం...ఆంధ్ర విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా ఆచార్య వి.కృష్ణమోహన్‌ నియామకంపైనా విమర్శలున్నాయి. విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం ఒక వ్యక్తి అత్యధికంగా ఆరేళ్లపాటే రిజిస్ట్రార్‌గా కొనసాగే అవకాశం ఉండగా ఈ నిబంధన పాటించడం లేదు. ఈ నిబంధన విశ్వవిద్యాలయం యూనిట్‌గానే పని చేస్తుందని, గతంలో ఆయన అంబేడ్కర్‌ వర్సిటీలో పని చేసింది లెక్కలోకి రాదనే వాదనను ఆంధ్ర వర్సిటీ వినిపిస్తోంది. ఉద్యోగ విరమణ అనంతరం రెండు సార్లు ఆచార్యుడిగా పునఃనియామకం పొందడం, రిజిస్ట్రార్‌గా కొనసాగిన ఉదంతాలు రాష్ట్ర విశ్వవిద్యాలయాల చరిత్రలోనే లేకపోవడం విశేషం. కొంతమంది తాత్కాలిక సిబ్బందికి ఎలాంటి అనుమతి లేకుండానే స్కేల్స్‌ ఇవ్వడంపైనా విమర్శలున్నాయి. డిపార్టుమెంట్‌ పరీక్షలు రాయకుండానే కొందరికి పదోన్నతులు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.

  • రాయలసీమ విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. దీనిని అప్పటి మంత్రి అడ్డుకోవడంతో పక్కనపెట్టేశారు.
  • కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది పోస్టులను బోధన పోస్టులుగా ప్రభుత్వం మార్చేసింది. డైరెక్టరు, డిప్యూటీ, సహాయ డైరెక్టర్ల పోస్టులను బోధన పోస్టులుగా మార్చారు. మొత్తం 15 పోస్టులను ఇలా మార్చేశారు. సీఎం కార్యాలయంలో పనిచేసే ఓ కీలక అధికారి బంధువు ఉండటంతో నిబంధనలు ఇష్టారాజ్యంగా మార్చారనే ఆరోపణలున్నాయి.
  • నాగార్జున వర్సిటీలో బోధనేతర సిబ్బంది పదోన్నతులు, కారుణ్య నియామకాల్లో నిబంధనలను ఉల్లంఘించినట్లు చక్రపాణి కమిటీ పేర్కొంది. దీనిపై ఎలాంటి చర్యలూ లేవు.
  • గతంలో ఆదికవి నన్నయ వర్సిటీలో నియామకాలపై ఆరోపణలొచ్చాయి. వీటిపై 3 కమిటీలను వేశారు. ఈ కమిటీల నివేదికలపై ఎలాంటి చర్యలూ లేవు.

ఎన్నెన్నో ఉల్లంఘనలు..

  • శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గతంలో వసతి గృహాల నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం కమిటీని నియమించింది. రూ.60లక్షల వరకు దుర్వినియోగమైనట్లు ఆ కమిటీ తేల్చింది. దీనిపై చర్యలు లేవు.
  • ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘రీ-రీవాల్యుయేషన్‌’ పేరుతో పలువురు విద్యార్థుల సమాధాన పత్రాల్ని మూల్యాంకనం చేయించడం... అందులో కొందరు విద్యార్థులు ఉత్తీర్ణులవడం పెను దుమారాన్నే రేపింది.
  • కృష్ణా వర్శిటీ నిర్వహించిన ‘లా’ పరీక్షల్లో ఒక సబ్జెక్టులో ఫెయిలైన విద్యార్థులు ఆ తర్వాత రీవాల్యుయేషన్‌తో ఒక్కరు మినహా అందరూ ఉత్తీర్ణులయ్యారు. దీనిపై ఆరోపణలొచ్చాయి.
  • జేఎన్‌టీయూ అనంతపురంలో కొన్ని ఖాళీ డిగ్రీ పట్టాలు కనిపించకుండా పోయినట్లు ఇటీవల ఆడిటింగ్‌లో గుర్తించినట్లు తెలిసింది. ఈ విషయం బయటకు రాకుండా ఆడిటింగ్‌ సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు.

నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏడాది క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో విద్యా సంస్థ రాజకీయాలకు వేదికగా మారిందనే అపవాదును మూటగట్టుకుంది. ప్రభుత్వ, పార్టీపరమైన కార్యక్రమాలకు వర్సిటీ ఆడిటోరియం, అతిథి గృహాలను కేటాయిస్తున్నారనే విమర్శలున్నాయి. వైకాపా ప్లీనరీ సందర్భంగా ఈ నెల 8న వర్సిటీలో తరగతులు రద్దు చేయగా.. 9న సెలవు ప్రకటించారు. పరీక్షలను వాయిదా వేశారు. ప్లీనరీకి వచ్చే వాహనాల పార్కింగ్‌కు వర్సిటీ స్థలాన్ని కేటాయించారు. రెండేళ్లకుపైగా ఇన్‌ఛార్జి వీసీతోనే వర్సిటీ కొనసాగుతోంది.

ఇదీ చదవండి:సర్వర్‌లో సమస్య.. నిలిచిన 108 డయల్‌ సేవలు

ABOUT THE AUTHOR

...view details