ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్థానికులకే రాజ్యసభ సీట్లు కేటాయించాలి: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ - విశాఖ జిల్లా తాజా వార్తలు

UNEMPLOYMENT JAC PROTEST: తెలంగాణ వ్యక్తులకు ఏపీలో రాజ్యసభ సీట్లు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. స్థానికులకే రాజ్యసభ సీట్లు కేటాయించాలని.. లేకుంటే అన్ని పార్టీలను కలుపుకొని ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పూనుకుంటామని హెచ్చరించారు.

UNEMPLOYMENT JAC PROTEST
స్థానికులకే రాజ్యసభ సీట్లు కేటాయించాలి

By

Published : May 31, 2022, 3:55 PM IST

UNEMPLOYMENT JAC PROTEST: తెలంగాణ వ్యక్తులకు ఏపీలో రాజ్యసభ సీట్లు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ వినూత్నరీతిలో నిరసన తెలిపింది. స్థానికులను కాదని తెలంగాణ వారికి సీట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. పెద్దల సభలో స్థానికేతరులను కూర్చోబెట్టడం వల్ల.. ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం నిధులు, కడప స్టీల్‌ప్లాంట్‌ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. స్థానికులకే రాజ్యసభ సీట్లు కేటాయించాలని లేకుంటే అన్ని పార్టీలను కలుపుకొని ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పూనుకుంటామని హెచ్చరించారు.

స్థానికులకే రాజ్యసభ సీట్లు కేటాయించాలి

YSRCP Rajya Sabha MP Candidates: అధికార వైకాపా నలుగురు రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. అందులోఒకరు అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి కాగా.. మరొకరు ఆ కేసును వాదిస్తున్న న్యాయవాది నిరంజన్‌రెడ్డి. మొత్తం నాలుగు సీట్లలో ఏపీ, తెలంగాణకు చెరో సగం పంచారు. వచ్చే నెలతో పదవీకాలం ముగియనున్న విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించగా.. నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావును జగన్ ఎంపిక చేశారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన నిరంజన్‌రెడ్డితోపాటు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య వైకాపా తరఫున పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. వైకాపా అవిర్భావం తర్వాత ఆ పార్టీకి తొలిసారి 2017లో రాజ్యసభకు అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం రాగా.. జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డికి ఇచ్చారు.

అప్పటి నుంచి ఆయన ఎంపీగా, వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. వచ్చే నెలతో ఆయన పదవీకాలం ముగియనుండగా... మరోసారి అవకాశం ఇస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రికి సంబంధించిన కేసులను వాదిస్తున్న తెలంగాణకు చెందిన న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డికి ఇప్పుడు రాజ్యసభ టికెట్‌ కేటాయించారు. దీంతో కేసుల్లోని సహచరుడికి రెండో అవకాశం, కేసులను వాదిస్తున్న న్యాయవాదికి కొత్తగా సీఎం అవకాశం కల్పించారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరో రెండు సీట్లకు తెలుగుదేశం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బీసీ నేతలను జగన్ ఎంపిక చేశారు. వీరిలో ఒకరు కావలి నుంచి తెలుగుదేశం తరఫున గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన బీద మస్తాన్‌రావు కాగా... మరొకరు 2014లో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్​ నుంచి తెదేపా ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్‌.కృష్ణయ్య ఉన్నారు.

మొత్తంగా నెల్లూరు జిల్లా నుంచే ముగ్గురు వైకాపా ఎంపీలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, విజయసాయిరెడ్డి ఉండగా.. అదే జిల్లాకు చెందిన మస్తాన్‌రావుకు అవకాశం కల్పించారు. రాజ్యసభ స్థానాలకు అధికార పార్టీలో తీవ్ర పోటీ నెలకొనగా ఒక స్థానం బీసీలకు, మరొకటి ఎస్సీలు లేదా మైనార్టీలకు ఇవ్వాలని ముందుగా భావించారు. చివరికి రెండో సీటు కూడా బీసీలకే ఇచ్చారు. బీసీ కోటాలో బీద మస్తాన్‌రావు పేరు జనవరిలోనే ఖరారు కాగా మరో స్థానాన్ని కూడా బీసీలకే ఇస్తే 50శాతం స్థానాలను ఇచ్చామన్న సందేశం ఆ వర్గంలోకి వెళ్తుందని భావించారు. ఎవరో ఒక బీసీ నేతకు సీటు ఇస్తే పెద్దగా ప్రజల్లోకి వెళ్లకపోవచ్చని. ఆ వర్గంలోకి సందేశం గట్టిగా వెళ్లాలంటే బీసీలకు బ్రాండింగ్ ఉన్న ఆర్‌.కృష్ణయ్యను ఎంపిక చేయడమే మేలని వైకాపా అధిష్టానం అనుకుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఆర్‌.కృష్ణయ్య తెలంగాణకు చెందిన వ్యక్తి అయినప్పటికీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేతగా గుర్తింపు ఉండటం కలిసొచ్చే అంశంగా వైకాపా భావిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆర్‌.కృష్ణయ్యకు సమాచారం వెళ్లగా.. వెంటనే ఆయన జగన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత అభ్యర్థిత్వం ప్రకటించారు. బీసీల కోసం నిలబడ్డ వ్యక్తి కృష్ణయ్యను రాజ్యసభకు పంపించి బీసీల గళం వినిపిస్తే.. ఆ సందేశం బలంగా వెళుతుందనే ఆయన్ను ఎంపిక చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావు... విజయసాయిరెడ్డికి సన్నిహితుడు. 2019 వరకు తెలుగుదేశంలో ఉన్న ఆయన్ను విజయసాయిరెడ్డే పట్టుబట్టి వైకాపాలోకి తీసుకొచ్చారు. పార్టీలో చేరిన వెంటనే ఆయన రాజ్యసభ సీటు ఆశించినా.... అప్పుడు అవకాశం రాలేదు. ఇప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇక నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండింటిని బీసీలకు కేటాయించిన విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పార్టీ నాయకులను సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details