విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా.. గుంటూరులో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. గుంటూరు నుంచి విశాఖ వరకు నాలుగు రోజుల పాటు ఈ ర్యాలీ కొనసాగనుంది. అమరావతి రోడ్డులోని అమృతరావు విగ్రహం వద్ద ఈ ర్యాలీని ఎమ్మెల్సీలు రామసుబ్రహ్మణ్యం, కత్తి నర్సింహారెడ్డి ప్రారంభించారు.
చాలా దేశాలు, మనదేశంలోనూ ఐదు రాష్ట్రాలు పోస్కోను తరిమికొట్టాయని... ఏపీలోకి రావడానికి ఎవరు అవకాశమిచ్చారని ఎమ్మెల్సీ రామసుబ్రమణ్యం ప్రశ్నించారు. ఆంధ్రప్రజలు అమాయకులా... అడిగేవారు లేరనా.. అంటూ ఆయన నిలదీశారు. అమృతరావు స్ఫూర్తితో విద్యార్థులు, యువజనులు, కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు.. అన్నివర్గాల ప్రజలు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పాలని రామసుబ్రమణ్యం పిలుపునిచ్చారు.