విశాఖ జిల్లా రావికమతం మండలం చిన్నపాచిలి-పట్నాబిల్లి రోడ్డు మార్గంలో గ్రానైట్ రాళ్లను తరలించే ట్రాలీ వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఇదే ప్రమాదంలో ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు.
వి. మాడుగుల మండలం జాలంపల్లి గ్రామానికి చెందిన గోరా రాజేశ్వరి, ఆమె సోదరుడు అలమండ శివాజీ ఇద్దరు ద్విచక్రవాహనంపై గదబపాలెంలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు. తిరిగి స్వగ్రామం వెళుతుండగా ఎర్రబంధకు రాగానే వెనుకనుంచి వచ్చిన ట్రాలీ.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనం వెనుక కూర్చున్న రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ ఆమె సోదరుడు శివాజీని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై సూర్యనారాయణ తెలిపారు.