విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ పరిధిలో అటవీ భూముల సాగులో ఉన్న అర్హులైన గిరిజనులు అందరికీ పట్టాలు తక్షణమే మంజూరు చేయాలంటూ నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం, 5వ షెడ్యూలు సాధన కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్ళలో రాస్తారోకో నిర్వహించారు. మైదాన గిరిజన నివాసాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.
2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగులో ఉన్న గిరిజన రైతులకు నేటి వరకు ఇవ్వలేదని విమర్శించారు. ఈ సమస్య నర్సీపట్నం డివిజన్ పరిధిలో రోలుగుంట, గోలుగొండ , రావికమతం తదితర మండలాల్లో ఉందని తెలిపారు . ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు అమలు చేస్తున్న పథకాలు పొంతన లేదని ఆరోపించారు. గిరిజనులకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేని ప్రభుత్వం మైనింగ్ మాఫియా దరఖాస్తులను తక్షణమే పరిశీలించడానికి పరుగులు తీస్తోందని వ్యాఖ్యానించారు. ఈ ధర్నాలో అధిక సంఖ్యలో గిరిజన రైతులు పాల్గొన్నారు.