విశాఖ మన్యంలోని చాలా గ్రామాల్లో నేటికీ సరైన రవాణా సదుపాయాలు లేవు. ఊరు దాటి వెళ్లాలంటే పాతకాలం నాటి ప్రయాణ సాధనాలనే వినియోగిస్తున్నారు అక్కడి గిరి పుత్రులు. విశాఖ మన్యంలోని అత్యంత మారుమూల కొండ గూడాల్లో.... అశ్వాలనే ప్రయాణ సాధనాలుగా వాడుతున్నారు. ముఖ్యంగా వారాంతపు సంతకు చేరుకోవాలంటే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ గుర్రాల సాయంతోనే కొండా, కోనలు దాటుతున్నారు.
ఊరు దాటాలంటే... అశ్వమే ఆధారం! - గుర్రాలపై ఆధారపడుతున్న గిరిపుత్రులు
విశాఖ మన్యంలో గిరిపుత్రులు కొండలు, కోనలు దాటాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రవాణా సౌకర్యాలు లేకపోవటంతో అశ్వాలనే నమ్ముకుంటున్నారు. చిన్న పిల్లలు సైతం వీటి మీదే ప్రయాణం చేస్తున్నారు.
సంతకు వెళ్లాలంటే తంట
వారు తెచ్చిన దినుసులను సంతల్లో అమ్మి ... నిత్యావసర సరుకులు కొని గోనె సంచుల్లో నింపుతారు. వాటిని గుర్రాలపై వేసి ఇంటికి తిరుగు ప్రయాణం అవుతారు. కాలాలు మారినా వారి జీవితాలు మాత్రం అభివృద్ధిపరంగా వంద ఏళ్ల వెనకే ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో సెల్ సిగ్నల్స్ కూడా అందవు. ఇప్పటికీ ఈ ప్రాంతాలు బాహ్య ప్రపంచానికి దూరంగానే ఉంటున్నాయి.
మినీ బస్సులు ఏర్పాటు చేస్తాం
మన్యం ప్రజల సమస్యలను రవాణా శాఖ మంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకెళ్లామని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. త్వరలోనే మినీ బస్సులు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. గంటల తరబడి గుర్రాలపై ప్రయాణించాలంటే చాలా ఇబ్బందిగా ఉందని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ గ్రామాలకు రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.