వంతెనలు నిర్మించక గిరిజనుల కష్టాలు విశాఖ జిల్లా పాడేరు మన్యంలోని మారుమూల గ్రామాలు వరదలతో వణుకుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతుండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి సమీపంలోని గ్రామాలను పట్టించుకొని.. తమ గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని గిరిజనలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ తలరాతలు మారటం లేదని వాపోతున్నారు. పాడేరు మండలం గోమంగి పంచాయతీలకు వెళ్లే 30 గిరిజన పల్లెలకు ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు రాకపోకలు సాగిస్తున్నా అధికారులు వంతెనలు నిర్మించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెడ్డలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నా మరో దారిలేక రాకపోకలు సాగిస్తున్నామనీ, ఇటీవలే ఓ యువకుడు ద్విచక్రవాహనంతో వాగులో పడిపోతే స్థానికులు రక్షించారని వారు వివరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మారుమూల గ్రామాల గెడ్డలపై వంతెనలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.