విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం చింతగున్నలలో గిరిజనులకు రూ. 12 వేల నుంచి రూ. 25 వేల వరకు విద్యుత్ బిల్లులు వచ్చాయి. అధిక మొత్తంలో బిల్లులు రావడంతో.. వారంతా సమీప విద్యుత్ కార్యాలయానికి పరుగెత్తారు. ప్రభుత్వం తమకు సబ్సిడీ కల్పిస్తోందనీ.. భారీ మొత్తంలో వచ్చిన ఈ బిల్లులతో మాకు సంబంధం లేదని చెబుతున్నారు.
ఏజెన్సీ పరిధిలో 200 యూనిట్ల విద్యుత్ వాడకం వరకు ఉచితంగా ప్రభుత్వం అందజేస్తోంది. సబ్సిడీ విద్యుత్ మీటర్లకు ఇప్పుడు అధిక మొత్తంలో బిల్లులు వచ్చాయి. పలుచోట్ల ఈ విధంగానే రావడంతో.. గిరిజనులు పాడేరు విద్యుత్ కార్యాలయానికి వచ్చి వినతి పత్రాలు సమర్పించారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో.. స్థానిక విద్యుత్ సిబ్బందికీ గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. వెంటనే తమ బిల్లులు సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.