విశాఖ మన్యం అందాలు పర్యటకులను ఆకర్షించటంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. అలాంటి మన్యం అందాలకు జలపాతం హోరు జోడీ కావడం ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. విశాఖ మన్యంలోని జి.మాడుగుల మండలం చింతపల్లి వెళ్లేదారిలో ఉందీ కొత్తపల్లి జలపాతం. అందులోనూ ఆదివారం సెలవు రోజు కలిసి రాగా.. జలపాతాన్ని చూసేందుకు పర్యటకులు పోటెత్తారు.
చింతపల్లి మండలం లంబసింగి చూసిన పిదప పర్యటకులు ఇక్కడ జలపాతం వద్ద సేదతీరేందుకు వస్తుంటారు. ఐదేళ్ల కిందట ప్రభుత్వం కోటి రూపాయల ఖర్చుతో జలపాతాన్ని అభివృద్ధి చేసింది. ప్రమాద రహితంగా తీర్చిదిద్దిన ఫలితంగా.. పర్యటకుల తాకిడి మరింత ఎక్కువైంది. ఎత్తైన కొండ నుంచి జాలువారే నీటి ప్రవాహం.. వీక్షకులను కట్టిపడేస్తుంది. ఈ ఉత్సాహంలో.. పర్యటకులు నీటిలో కేరింతలు కొడుతూ.. సెల్ఫీలు దిగుతున్నారు.