"బొర్రా గుహలు.. వసతులు కరవు".. BORRA CAVES : సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలు నిత్యం పర్యాటకులను ఆహ్వానిస్తునే ఉంటాయి. ఈ గుహలను చూడటానికి వివిధ రాష్ట్రాల నుంచి పర్యటకుల సంఖ్యా ఎక్కువే. అధ్యయనానికి వచ్చే వారు కొందరైతే, పర్యాటకంగా సందర్శించడానికి వచ్చే వారు కొందరు. శివరాత్రికి జరిపే జాతర సమయంలో, వేసవి కాలంలో, శీతాకాలంలో వచ్చే సందర్శకులు అధికమే. ప్రతి సంవత్సరం సందర్శకులు పెరుగుతున్న కనీస వసతులు లేక వారికి అగచాట్లు తప్పడం లేదు.
అరకు పర్యాటక ప్రదేశాలు అనగానే గుర్తుకు వచ్చే వాటిల్లో ఒకటి బొర్రా గుహలు. డిసెంబరు, జనవరి మాసాలతో పాటు..వారాంతాల్లోనూ వేల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. విశాఖ నుంచి అరకు ప్రయాణానికి కేంద్రం ప్రభుత్వం 2017లో ప్రత్యేకంగా అద్దాల బోగీలను ఏర్పాటు చేసింది. కొండల్లో ఈ ప్రయాణం.. 58 సొరంగాల నుంచి సాగుతుంది. రైలు ప్రయాణం ప్రతి పర్యాటకునికి గొప్ప అనుభూతినిస్తుంది. అడవులు, జలపాతాల మధ్య సాగే ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
"మేము 30 మంది వచ్చాము. లోపల చూడటానికి చాలా బాగుంది. గుహల్లో ఇంకొన్ని లైట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అంతే కాకుండా కుర్చోడానికి కుర్చీలు లేవు. ముఖ్యంగా తాగడానికి మంచి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం"-పర్యాటకులు
రైల్వే స్టేషన్ నుంచి బొర్రా గుహలకు వెళ్లేందుకు కనీస సదుపాయాలు లేకపోవటంతో ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి వస్తోందని...పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేశారు. మలుపుల రోడ్లలో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని పర్యాటక శాఖ ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తే.... ప్రయాణం సులభతరమవుతుందని అంటున్నారు. గుహల్లో కనీస వసతులు లేక పర్యాటకులకు ఇబ్బందిగా మారింది. తాగునీరు, మరుగుదొడ్లు ..సౌకర్యాల కోసం గుహల ఎంట్రీపాయింట్‌కు వెళ్లాల్సి వస్తోందని పర్యాటకులు తెలిపారు. పూర్తిస్థాయిలో గుహల్లో లైట్లు లేకపోవటంతో అక్కడక్కడ దారి కనిపించటంలేదంటున్నారు. పర్యాటకంగా మరింత అభివృద్ధి చెసేందుకు గుహల్లో రెస్టారెంట్లు, పూర్తిస్థాయిలో లైట్లు ఏర్పాటు చెయ్యాలని పర్యాటకులు కోరుతున్నారు.
"గుహల్లో లోపలికి వెళ్లినప్పుడు తాగడానికి నీరు లేక ఇబ్బంది పడ్డాం. చిన్నపిల్లలతో వచ్చే వారు మరీ ఇబ్బంది పడుతున్నారు. తాగునీటిని వసతిని కల్పిస్తే ఎక్కువ సేపు ఆనందంగా గడపడానికి ఉంటుంది. అలానే టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తే మహిళలకు, చిన్నపిల్లలకు ఉపయోగపడుతుంది"-పర్యాటకులు
గుహల వద్ద చిరు వ్యాపారాలపై ఆధారపడిన కుటుంబాలకు చేయూత అందించేలా.. ప్రభుత్వం వసతులు కల్పించాలని దుకాణదారులు కోరుతున్నారు. పర్యాటకంగా గొప్ప అనుభూతిని ఇచ్చే గుహల వద్ద.. కనీస వసతి సౌకర్యాల ఏర్పాటుతో సందర్శకులకు ఇబ్బందులు తప్పుతాయని అంటున్నారు. పర్యాటక ప్రాంతంలో సందర్శకులకు వసతులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: