రాష్ట్రంలో అధ్వానంగా మారిన పర్యాటక ప్రాజెక్ట్‌లు.. వెను దిరుగుతున్న పర్యాటకులు AP Tourism Projects Negligence: రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన హోటళ్లు, రిసార్ట్‌లు వెలవెలబోతున్నాయి. ఒకసారి వచ్చిన సందర్శకులు మళ్లీ ఆ హోటళ్లలో అడుగుపెట్టడం లేదు. ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఎప్పుడో నిర్మించిన హోటళ్లు, రిసార్టులను ఆధునీకరించకపోవడంతో పర్యాటకులు ముఖం చాటేస్తున్నారు. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే విశాఖ, విజయవాడ, తిరుపతిలోనూ ఇదే పరిస్థితి ఉంది.
రాష్ట్రంలోని పర్యటక ప్రాజెక్ట్‌లను కనీస పట్టించుకోని ప్రభుత్వం.. ఒక్క విశాఖలోని రుషికొండ ప్రాజెక్ట్‌కు మాత్రం కోట్లు కుమ్మరిస్తోంది. కొండపై లక్షణంగా ఉన్న రిసార్టులను తొలగించి మరీ అదే ప్రాంతంలో నాలుగు బ్లాకుల్లో 164 కోట్ల రూపాయలతో కొత్త భవనాలు నిర్మిస్తోంది. వీటిల్లో అదనపు సౌకర్యాల కోసం మరో 150 కోట్లు అవసరమని అధికారులు అంచనాల్ని మళ్లీ సవరించడం విశేషం. రుషికొండను తవ్వి చదును చేయడంతోపాటు రహదారి నిర్మాణానికే 92 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఆ తర్వాత భవన నిర్మాణాలకు మరో 72 కోట్లు ఇచ్చింది. ఇక్కడ 4 భవనాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.
రుషికొండపై పాత భవనాలను తొలగించి అదే స్థానంలో కొత్త భవన నిర్మాణాలకు కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం.. మిగతా ప్రాంతాల్లోని హోటళ్లు, రిసార్టులను బ్యాంకు రుణంతో ఆధునికీకరించేందుకు ఏపీటీడీసీ కి అనుమతులిచ్చి చేతులు దులిపేసుకుంది. విజయవాడలోని బెర్మ్ పార్కును ఓ జాతీయ బ్యాంకుకు తనఖా పెట్టి 143 కోట్ల రుణం తీసుకోవడానికి అధికారులు ఏడాదిగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. రుణం ఎప్పుడు వస్తుందో.. హోటళ్లు, రిసార్టుల ఆధునికీకరణ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ఒక్క రుషికొండ ప్రాజెక్టే 164 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అదే 110 కోట్లు అందిస్తే 17 హోటళ్లు, రిసార్టుల ఆధునికీకరణతోపాటు మరో 9 పర్యాటక పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేవి.
విశాఖలోనే ఉన్న హరిత యాత్ర నివాస్‌కు 5.10 కోట్లు, అరకులోని హరిత హిల్ రిసార్ట్‌కు 10.85 కోట్లు, హరిత వాలీ రిసార్ట్‌కు 3.10 కోట్లు కేటాయిస్తే ఆధునీకరణ పనులు పూర్తవుతాయి. అనంతగిరిలోని హరిత హిల్ రిసార్ట్‌కు 5.54 కోట్లు, టైడాలోని హరిత హిల్ రిసార్ట్‌కు కోటీ 76 లక్షలు, దిండిలోని హరతి కోకోనట్ కంట్రీ రిసార్ట్ కు కోటీ 63 లక్షలు అవసరం కానున్నాయి. వీటితో పాటు విజయవాడలోని బెర్మ్‌పార్కుల హరిత హోటల్‌కు 3 కోట్లు, భవానీద్వీపంలోని హోటల్ ఆధునీకరణకు 2.60 కోట్లు కేటాయించాలని అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక హరిత బీచ్ రిసార్ట్‌కు 2.60 కోట్లు, హార్సిలీహిల్స్‌లోని హరిత హిల్‌రీసార్ట్‌కు 6.50 కోట్లు కావాల్సి ఉంది వీటితోపాటు మైపాడు, ఓర్వకల్లు, కడప, గండికోట, శ్రీశైలం, కర్నూలులోని హోటళ్లకు కొద్దిమొత్తంలోనే కేటాయింపులు జరిపితే.. పర్యాటకలును విశేషంగా ఆకర్షించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో పనులు ఇప్పటికే ప్రారంభించి వివిధ దశల్లో నిలిచిపోయిన పర్యాటక ప్రాజెక్టులకు 50.45 కోట్లతో అంచనాలను సవరించినా వీటిల్లో అత్యధికం ఇప్పటికీ పూర్తికాలేదు. 9 ప్రాజెక్టుల పనులను 21.45 కోట్ల అంచనాలతో ప్రారంభించారు. 8.74 కోట్లకుపైగా ఖర్చు చేశాక వివిధ కారణాలతో పూర్తి కాలేదు. బ్యాంకు రుణంతో వీటిని పూర్తి చేసేందుకు అంచనాలను సవరించారు. ఇందులో లంబసింగిలో అసంపూర్తిగా నిలిచిపోయిన రిసార్టుల నిర్మాణం మాత్రం పూర్తయింది.
బొర్రా గుహల్లో పర్యాటకులకు మౌలిక సదుపాయాలు, కోటప్పకొండ రోప్ వే, మారేడుమిల్లిలో కాటేజీల అభివృద్ధి, సాహస క్రీడలు, ఇతర సదుపాయాలకు సంబంధించిన పనులూ పూర్తి కాలేదు. మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్‌లో దెబ్బతిన్న రిసార్ట్ అభివృద్ధి పనులకు రెండేళ్లక్రితం 5.32 కోట్లతో చేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. బీచ్‌కు వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతున్నా వసతులు మాత్రం అంతంతే ఉన్నాయి. విశాఖలోని రుషికొండ రిసార్ట్ కూల్చివేసిన తర్వాత.. అప్పుఘర్‌లోని హరిత యాత్ర నివాస్‌కు ప్రాధాన్యం పెరిగింది. అయితే ఇక్కడ సదుపాయాల లేమి, నిర్వహణ లోపంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హోటల్ ఆధునికీకరణకు రెండేళ్ల క్రితం 5.10 కోట్లతో ప్రతిపాదనలు పంపినా.. ఇప్పటికీ అతీగతీ లేదు.
ఇవీ చదవండి: