Laksh Chandi Maha Yajna: కురుక్షేత్ర వేదికగా విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో కొనసాగుతున్న శ్రీ లక్ష చండీ మహా యజ్ఞంలో చండీమాత అష్టోత్తర భుజి నర్తనకాళి అవతారంలో దర్శనమిచ్చింది. శుక్రవారం నాటికి యజ్ఞం 14 రోజులు పూర్తయ్యాయి. మరో రెండు రోజుల్లో మహా పూర్ణాహుతితో బృహత్తర కార్యక్రమం పూర్తి కానుంది. శనివారం నాడు కురుక్షేత్రలో శివ పార్వతుల కళ్యాణం జరగనుంది.
యజ్ఞంలో 14వ రోజు..: మరోపక్క యజ్ఞంలో 14వ రోజు చండీమాతను ఆరాధిస్తూ గరిష్ట సంఖ్యలో పారాయణ హోమాలు నిర్వహించారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర, గుంతిమాత యజ్ఞాన్ని పర్యవేక్షించారు. అలాగే గుంతిమాత ఆశ్రమంలో పంచముఖ ఆంజనేయ స్వామి, కాలభైరవ, బాలా త్రిపురసుందరి దేవతామూర్తుల విగ్రహాలను పీఠాధిపతుల చేతుల మీదుగా ప్రతిష్టించారు. లోకశాంతిని కాంక్షిస్తూ శనివారం యజ్ఞభూమిలో శివ పార్వతుల కళ్యాణం చేపడుతున్నారు.
ఒకే సమయంలో సప్తశతీ పారాయణ..: కురుక్షేత్ర వేదికగా విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో కొనసాగుతున్న శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం యజ్ఞభూమిలో చండీ మాత మహా వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. 13వ రోజు జరిగిన యజ్ఞంలో చండీ మాతను ఆరాధిస్తూ... 6912 పారాయణ హోమాలు నిర్వహించారు. యజ్ఞంతో పాటు ఒకే సమయంలో సప్తశతీ పారాయణ చేపట్టారు.
పంచకుల ప్రాంతాన్ని సందర్శించిన స్వరూపానందేంద్ర స్వామి..: విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి, గుంతిమాత యజ్ఞాన్ని పర్యవేక్షించగా, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామివారు కురుక్షేత్ర సమీపంలోని పంచకుల ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి చండీమాత ఆలయంలో పూజలు నిర్వహించారు. యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతోందని, పరిపూర్ణమయ్యేలా నిర్వాహకులకు శక్తిని ప్రసాదించాలని చండీమాతను ప్రార్ధించారు. అదేవిధంగా పంచకుల ప్రాంతంలోని కాళికా మందిరాన్ని, మానసాదేవి మందిరాన్ని సందర్శించిన అనంతరం కురుక్షేత్ర చేరుకున్నారు.
ఇవీ చదవండి