Subsidy On Tomatoes In Ap: రాష్ట్ర మార్కెటింగ్ శాఖ రాయితీ మీద ఇస్తున్న టమాటా వినియోగదారులకు గలాటాను మాత్రమే మిగులుస్తోంది. 'ఓ స్త్రీ రేపు రా' అన్నట్లు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి క్యూలైన్లలో నిల్చున్న వినియోగదారులు కౌంటర్ల వద్దకు చేరుకునే సరికి వారికి నిరాశే ఎదురవుతోంది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖకు టమాటా పంపిణీ ఓ సవాలుగా మారుతోంది.
విశాఖ కంచరపాలెం రైతుబజార్ వద్ద రాయితీ టమాటాల కోసం మహిళలు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిల్చుని ఉన్నారు. మండే ఎండలో గంటల తరబడి నిల్చున్నప్పటికి టమాటాలు దొరకకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రేషన్ షాపుల వద్దేకే ఈ రాయితీ టమాటాలను పంపిణీ చేసే విధానాన్ని అమలు చేస్తే.. ఇన్ని ఇక్కట్లు పడే అవసరం ఉండదు కదా అని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్ల వృద్ధుల నుంచి అన్ని వయసుల వారు గంటల తరబడి రైతు బజార్ల వద్ద క్యూలైన్లలో నిలబడినప్పటికీ రాయితీ టమాటాలు దొరుకుతాయన్న గ్యారెంటీ లేకుండా పోతుందని వాపోతున్నారు. ఇప్పటికైనా తమ బాధను అర్ధం చేసుకుని సంబంధిత శాఖాధికారులు ఆయా ప్రాంతాల్లోని రేషన్ షాపుల వద్దే టమాటాను విక్రయించాలని మహిళా వినియోగదారులు కోరుతున్నారు. రాయితీ టమాటాలను పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Subsidy Tomatoes in AP అక్కడ టమాట కిలో రూ.50 లే..! రైతు బజారుకు క్యూ కట్టిన జనాలు..!